‘జబర్దస్త్’ షో ద్వారా పరిచయమైన ‘హైపర్ ఆది’ పేరు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదేమో! ఎందుకంటే ఒకప్పుడు ‘జబర్దస్త్’లో హైపర్ ఆది ఒకడు. కానీ ప్రస్తుతం హైపర్ అది అనే కమెడియన్ ‘జబర్దస్త్’ షోలో స్కిట్స్ చేస్తున్నాడు. అవును… అంతలా ప్రేక్షకులను సమ్మోహితులను చేయడంలో సక్సెస్ అయ్యాడు కాబట్టే, ఇపుడు ‘హైపర్ ఆది’ అంటే ఒక ‘బ్రాండ్’గా మారింది. ఇంకా చెప్పాలంటే ‘సిల్వర్ స్క్రీన్’పై త్రివిక్రమ్ పంచ్ లకు, ‘బుల్లితెర’పై ఆది పంచ్ లకు నవ్వు రాకుండా ఉండదని చెప్పడంలో సందేహం లేదు.
ప్రస్తుతం సెలబ్రిటీ హోదాలో అనుభవిస్తున్న ఆది, ఏది చెప్పినా ఒక సంచలనమే అవుతుంది. మరి అలాంటి హైపర్ ఆదిని ‘జబర్దస్త్’ జడ్జి రోజానే ఇంటర్వ్యూ చేస్తే… అలాంటి ఆలోచనే ఓ వెబ్ మీడియాకు రావడం, దానిని షూట్ చేయడం, యూ ట్యూబ్ లోకి వదలడం జరిగిపోయింది. అందులో భాగంగా రోజా అడిగిన ఓ ప్రశ్న ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కాదు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రోజా ప్రశ్న రాజకీయాలపై కావడమే ఈ ప్రశ్నను వైరల్ అయ్యేలా చేసింది.
ప్రస్తుత రాజకీయాలు ఫాలో అవుతుంటారు కదా… ప్రస్తుత నాయకులలో మీకు ఎవరంటే ఇష్టం అని రోజా అడుగగా… ఇప్పుడే చెప్పలేను అని కాస్త మొహమాటపడ్డ ఆది, ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ గారు బాగా ఇష్టమండి అని చెప్పారు. ‘ఆయన పొలిటిషియన్ కాదు కదా…’ అని రోజా మళ్ళీ ప్రశ్నించగా, ‘అవుతారు’ అంటూ జవాబిచ్చారు ఆది. ‘మీరు దగ్గరుండి చేస్తారా’ అంటూ పంచ్ వేసిన రోజాకు, ‘మహిళలలో అయితే మీరే’ అంటూ దానికి శుభంకార్డు వేసారు.
రోజా ప్రశ్నలు – ఆది జవాబులతో కూడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బహుశా తన పేరునో, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పేరునో ఆది నోట పలికించడానికి రోజా విశ్వప్రయత్నాలు చేసినట్లుగా కనపడుతోంది అంటూ నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘జనసేన’ పార్టీని స్థాపించి, కొత్త రాజకీయ సిద్ధాంతాలకు రూపకల్పన చేస్తున్న పవన్ కు, అసెంబ్లీలో నాలుక బయటపెట్టి చేసే రాజకీయాలు రావు అంటూ ఈ వీడియోను షేర్ చేసుకుంటూ పంచ్ లు వేస్తున్నారు.



