కోట గారి “కోడికూర” గుర్తుకు ఉందా!

modi cheated andhra pradesh people ‘అహా నా పెళ్ళంట’ సినిమాలో ‘పిసినారి’ పాత్రలో ‘అవును…. ఆ మలపత్రాష్టుడిని నేనే…. అంటూ ఎంట్రీ ఇచ్చిన కోట శ్రీనివాసరావు పాత్రను ఎవరైనా మరిచిపోతారా…? అందులోనూ ఆ సినిమాలో ‘కోడికూర’ సన్నివేశం చూసి నవ్వుకోని ప్రేక్షకుడు ఉండడని చెప్పడంలో సందేహం లేదు. ఇంటి మధ్యలో కోడిని వ్రేలాడదీసి, పల్లెంలో అన్నం పెట్టుకుని తింటున్న కోట పాత్రకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. కోట పరిస్థితి ఇలా ఉంటే, వారింటికి భోజనానికి వచ్చిన బావమరిది పాత్ర ఎలా ఉందో తెలుసు కదా..!

ప్రస్తుతం ఆ పాత్రను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చి… కోడి స్థానంలో ఒక్కోరోజు ఒక్కో అంశం… స్పెషల్ స్టేటస్, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిధులు, మెట్రో ప్రాజెక్ట్… ఇలా ఒకటేమిటి ఏపీ ఏది అడిగితే అది కోడి స్థానంలోకి తెచ్చిపెడుతోంది ‘కోట’ అనే కేంద్రం. అవును… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ‘కోట గారి కోడికూర’ తినిపిస్తూ చోద్యం చూస్తున్న కేంద్రం వైఖరి పట్ల ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.

ADVERTISEMENT

సహనానికైనా హద్దు ఉంటుందని, అప్పుడు కేంద్రంలో ఉన్న సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ అడ్డగోలు విభజన చేసి ఏపీని నిట్టనిలువునా ముంచేయగా.., ఇపుడు మోడీ నాయకత్వంలోని బిజెపి, ఆ మునిగిన ఏపీ మరొకసారి లేవకుండా, అధ:పాతాళంలోకి నేట్టేయడానికి శతవిధాలా చేస్తున్న ప్రయత్నంగా ఏపీ ప్రజానీకం భావించే పరిస్థితికి కేంద్రం పాలన కొనసాగుతోంది.

విభజన బిల్లులో ఉన్న ప్రతి అంశం ఖచ్చితంగా అమలు చేస్తాం, ప్రతి పైసా ఏపీకి ఇచ్చి తీరుతాం అంటూ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు వినసొంపుగా ఉన్నా… అవి ఎప్పటికీ అమలు చేస్తారో అన్న విషయంపై స్పష్టత లేదు. ఇప్పటివరకు ముగిసిన కేంద్ర బడ్జెట్ లలో ఏపీకి దక్కింది ఏంటి అంటే… తెల్లముఖం వేసే పరిస్థితి. అలాగే మిగిలి ఉన్న బడ్జెట్ లలో ఏపీకి భారీ తాయిలాలు ముట్టచెప్తారని భావిస్తే అది అత్యాశగానే భావించాల్సి వస్తుంది.

ఇటీవల పార్లమెంట్ లో గల్లా జయదేవ్ అడిగినట్లుగా… ఏపీకి ఇచ్చే అంశాలు ఎప్పుడు, ఎంత మొత్తం, ఏ విధంగా ఇవ్వనున్నారో ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే… బహుశా కేంద్రంపై విమర్శలకు ఆస్కారం ఉండక పోవచ్చు. ఏదో మంజూరు చేస్తారనే ఆశ చూపించి రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసిన కేంద్రం తీరును ‘కోట గారి కోడికూర’ సన్నివేశంతో ముడిపెట్టడమే సబబు అంటున్నారు నెటిజన్లు.

ADVERTISEMENT
Latest Stories