హిట్టో ఫ్లాపో హుందాగా ఉండటమే కుర్ర హీరోలు చేయాల్సింది

Naga Shaurya Rangabaliసినిమా జయాపజయాలు సహజం. హీరో, దర్శకుడు, నిర్మాత, ఇతర బృందం ఖచ్చితంగా హిట్టు కొట్టాలనే లక్ష్యంతోనే పని చేస్తారు. కానీ విమర్శలు వచ్చినప్పుడు స్వీకరించినప్పుడే పరిపక్వత బయటపడి మరింత జాగ్రత్తగా ఉండటానికి దోహదపడుతుంది. రంగబలి విడుదలైంది. ఓపెనింగ్స్ పెద్దగా లేవు. టాక్, రివ్యూలు ప్రోత్సాహకరంగా లేవు. అంచనాలు అందుకోలేని మాట వాస్తవం.

అంతో ఇంతో వీకెండ్ మీద నమ్మకం పెట్టుకోవడం తప్పేం కాదు. ప్రమోషన్లో భాగంగా పోస్ట్ రిలీజ్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అన్ని రకాల ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి సమాధానం చెప్పడానికి సిద్ధపడినప్పుడే మెయిన్ సీట్లో కూర్చోవాలి. స్టార్లు, ఫిలిం మేకర్లు మనం బెస్ట్ తీశామని ఫీలవ్వడం నేరం కాదు. సినిమాలో సెకండ్ హాఫ్ సంతృప్తి పరచలేదనప్పుడు దానికి సహేతుకమైన కారణం వివరించాలి.

ADVERTISEMENT

అంతే తప్ప మేం కూడా చివరి దాకా కామెడీతో, బూతులతో మేమూ తీయగలమని, కానీ జనానికి ఒక మంచి చెప్పడానికి సంకల్పించుకున్నప్పుడు సీరియస్ టోన్ లోకి మార్చాల్సి వచ్చిందని డిఫెండ్ చేసుకోవడంలో లాజిక్ లేదు. మరి జాతిరత్నాలులో డబుల్ మీనింగులు ఉన్నాయనా ఆడియన్స్ ముప్పై కోట్లు ఇచ్చింది. కాదుగా. బలగం ఏముందని కోట్ల వర్షం కురిసింది.

ఎంత కమర్షియల్ జానరైనా సరే కనీసం కొంతమేర లాజిక్స్ కు కట్టుబడాల్సిందే. దర్శకుడు పవన్ బసంశెట్టి అదంతా క్యారెక్టరైజేషన్స్ లో భాగమని తప్పించుకుంటే ఎలా. పదేళ్ల వయసు కుర్రాడు తన మీద గుర్రం విగ్రహం పడబోతే ఒకడు కాపాడాడని సులభంగా గుర్తుంటుంది. మర్చిపోవడం ఉండదు. అలాంటిది కేవలం స్క్రీన్ ప్లే సౌలభ్యం కోసం ఊరి మీద పిచ్చ ప్రేమ ఉన్న హీరోకు నాన్న చిన్నప్పటి నుంచి మెడికల్ షాప్ నడిపిస్తున్న సెంటర్ గురించి పూర్తిగా తెలియకపోవడం విచిత్రం.

ఇలాంటివే మీడియా ఎత్తి చూపించింది. అలా తీస్తే పదహారు గంటలు సరిపోవని చెప్పుకోవడం సిల్లీనే. కెమెరాలు మనల్ని లైవ్ లో చిత్రీకరిస్తున్నప్పుడు సమాధానాలతో పాటు ప్రతి హావభావం శాశ్వతంగా రికార్డవుతుంది. ఇంత కన్నా క్రిటిసిజం చిరంజీవి, రజనీకాంత్ లాంటి పెద్ద స్టార్లే ఫేస్ చేశారు. కానీ ఎప్పుడూ బ్యాలన్స్ తప్పలేదు. వయసుతో సంబంధం లేని లక్షణం ఇది.

నాగశౌర్య తప్పు చేశాడని కాదు. తన వెర్షన్ లో న్యాయంగానే మాట్లాడాను అనుకోవచ్చు. కానీ సెలబ్రిటీల మాటలు ప్రైవేట్ కాదు. సెకండ్లలో పబ్లిక్ అయిపోతాయి. ఒకవేళ నెగటివిటిని స్వీకరించే ఉద్దేశం లేనప్పుడు వేరే ప్రమోషన్ ఈవెంట్ ప్లాన్ చేసుకుంటే సరిపోయేది. బాహుబలితో పోలికలు చేసుకోవడం వల్ల లేనిపోని ట్రోలింగ్ తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు.

యూత్ హీరోలతో వచ్చిన చిక్కే ఇది. ఆ మధ్య ఓ చిన్న హీరో ఎక్కడో పూణేలో ఉండేవాడు తన సినిమాకు బ్యాడ్ పబ్లిసిటీ చేస్తున్నాడంటాడు. ఇంకో నైజామ్ స్టార్ నన్ను ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారని స్టేట్ మెంట్ ఇస్తాడు. సినిమా ఆడకపోతే ఇంటి పేరు మార్చుకుంటానని సవాల్ విసురుతాడు. ఇలా ఎన్నో ఉదాహరణలున్నాయి. ప్రెస్ మీట్లో అసహనంగా లేచి వెళ్లిపోవడమంటే వచ్చిన వాళ్ళను అగౌరవపరచడమే. సినిమాలో నిజంగా బలముంటే ఎవరూ ఆపలేరు, అడ్డుకోలేరని చరిత్ర ఎన్నిసార్లు చెప్పినా కుర్ర కథానాయకులకు అర్థం కావడం లేదు ఏమిటో.

ADVERTISEMENT
Latest Stories