జనసేన పార్టీకి నాగబాబు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీగా ఉండటం వలన పార్టీ కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెట్టలేకపోతున్నారు. కనుక తమ్ముడు నాగబాబు చేతిలో పార్టీని పెట్టిన్నట్లున్నారు. అంటే కుటుంబ పార్టీ ముద్ర ఇప్పుడు గట్టిగా పడిందన్న మాట!
ఈ సందర్భంగా నాగబాబు శాస్త్రోక్తంగా చెప్పవలసిన నాలుగు ముక్కలు అంటే “క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా… ఈ పదవి మరింత బాధ్యత పెంచింది… అందరినీ కలుపుకుపోతా…” వంటివి సోషల్ మీడియాలో లిఖితపూర్వకంగా చెప్పేశారు. మంచిదే. కానీ నాగబాబు నోటి దురుసు గురించి అందరికీ తెలిసిందే. ఎంతటి వాడినైనా ‘ఆరేయ్ … ఒరేయ్…’ అంటూ బూతులు తిట్టేస్తుంటారు. వర్తమాన రాజకీయాలకు ఇదీ ఓ అర్హతే కనుక ఈ విషయంలో నాగబాబు క్వాలిఫై అయిన్నట్లే! అయితే పొత్తులు, అభ్యర్ధుల ఖరారు చేయడం, విధానపరమైన నిర్ణయాలు, ఎన్నికలకు వ్యూహాల విషయంలో నాగబాబు ఏం చేస్తారనేదే చాలా ముఖ్యం. పొత్తుల విషయంలో నేటికీ బిజెపి, టిడిపిల మద్య జనసేన ఊగిసలాడుతోంది. దీనిపై నాగబాబు ఏమైనా నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్‌ని, పార్టీ నేతలని ఒప్పించగలరా?వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ఏపీ తెలంగాణలో మంత్రులు, బిఆర్ఎస్, బిజెపి పార్టీలు భీకర యుద్ధం చేసుకొంటూ దాని నుంచి రాజకీయ మైలేజీ పొందాలని ఎంతగానో ప్రయాసపడుతున్నాయి. కానీ బిజెపితో పొత్తులో ఉన్నందున జనసేన మొక్కుబడి ప్రకటనతో సరిపెట్టేసింది. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తున్నా బిజెపితో జనసేన అంటకాగడం అవసరమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి నాగబాబు దగ్గర సమాధానం ఉందా?
1. పొత్తులు తేలితే కానీ అభ్యర్ధులను ప్రకటించలేరు. అయినా జనసేనకు బలం ఉన్న నియోజకవర్గాలలో అభ్యర్ధులను నాగబాబు ఖరారు చేయగలరా?
2. పొత్తులు వ్యవహారం తేలితే కానీ జనసేన విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. ఉదాహరణకు మోటర్లకు మీటర్లు పెట్టాలని బిజెపి వద్దని టిడిపి అంటోంది. జనసేన ఏమంటుంది?
3. ఎవరితో కలిసి ప్రయాణం చేయాలో తేల్చుకోకుండా నాగబాబు ఏం మాట్లాడగలరు?వైసీపీతో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అందరికీ తెలుసు. కానీ బిజెపితో వెళితే ఒకలాగా టిడిపి వెళ్ళాలనుకొంటే మరోలా మాట్లాడాల్సి ఉంటుంది కదా?అలాంటప్పుడు గోడమీద పిల్లిలా కూర్చొని కబుర్లు చెప్పక తప్పదు కదా?
కనుక నాగబాబు చెప్పుకొన్నట్లు ఈ పదవి మరింత బరువైనదే! ఎలా నెగ్గుకు వస్తారో? నాకన్నీ తెలుసనే నాగబాబు ఒకవేళ తన స్టైల్లో జనసేనకు శల్య సారధ్యం చేస్తే వచ్చే ఎన్నికలలో వీరమరణం-3 తప్పకపోవచ్చు.



