మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘ప్రేమమ్’ చిత్రాన్ని తెలుగులో నాగచైతన్య హీరోగా చందు మొండేటి రీమేక్ చేయబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఇందుకోసం స్క్రిప్ట్ కూడా సిద్దం అయ్యింది. ప్రస్తుతం చైతూ నటిస్తున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ పూర్తి అవ్వగానే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నారు. మొదటి నుండి కూడా ఈ సినిమాకు ‘మజ్ను’ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అవన్ని ఒట్టి పుకార్లు మాత్రమే అని తేలిపోయింది. ఈ రీమేక్‌కు సంబంధించిన టైటిల్ ఇప్పటి వరకు ఖరారు కాలేదు అని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు.
ఈ చిత్రానికి ఒరిజినల్ ‘ప్రేమమ్’ అనే టైటిల్‌నే పెడితే ఎలా ఉంటుందా అని దర్శకుడు చందు మొండేటి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అవ్వడంతో పాటు, టైటిల్ కూడా నోటెడ్ అయ్యింది. దాంతో అదే టైటిల్‌ను కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ టైటిల్ తెలుగు పదంలాగే ఉండటంతో ప్రేక్షకులు కూడా ఈజీగానే అర్థం చేసుకుంటారు అని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. డిసెంబర్ 1 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా శృతిహాసన్ మరియు అనుపమ పరమేశ్వరన్‌లు నటిస్తున్నారు. చైతూ ఈ రీమేక్‌పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.





