అందరూ హీరోలు ఇలాగే చేయాలి – నాని!

nani comments on fansఅభిమానులే దేవుళ్ళు… వారు ఏం చేసినా చూస్తూ ఉండాలి… అన్న ధోరణిని తెలుగులో ప్రతి హీరో అవలంబిస్తూనే ఉంటారు. అయితే ఈ లైన్ ను విరుద్ధంగా గత కొంతకాలంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇటీవల నాచురల్ స్టార్ నాని తమ భావాలను వినిపిస్తున్నారు. ముఖ్యంగా సినీ వేడుకలు జరిగే సమయంలో రెట్టించిన ఉత్సాహంతో అభిమానులు చేసే గోల, అతిధులకు, ఆహ్వానితులకు ఇబ్బందికరంగా మారుతుండడంతో, వీటిని ఖండించాల్సిన ఆవశ్యకత కనపడుతోంది అన్నది మాత్రం వాస్తవం.

ADVERTISEMENT

అయితే అల్లు అర్జున్ విషయంలో ఇది ప్రతికూల ప్రభావం చూపడంతో, తర్వాత మరే ఇతర హీరో అభిమానులను గైడ్ చేసే ప్రకటనలు చేయలేదు. పవన్ ఫ్యాన్స్ నే కాదు, తన అభిమానులకు కూడా బన్నీ ఓ చిన్న సైజ్ క్లాస్ పీకిన విషయం తెలిసిందే. అలాగే “నిన్ను కోరి” వేడుకలో నాని కూడా అదే తరహా క్లాస్ ను అభిమానులకు పీకారు. దీనికి తోడూ సోషల్ మీడియాలో ఓ అభిమాని విషయంలో జరిగిన రచ్చ నెటిజన్లకు తెలియని విషయం కాదు. ఈ ఉదంతంలో నాని తీవ్ర విమర్శల పాలయ్యాడు.

ప్రస్తుతం “నిన్ను కోరి” సినిమా ప్రమోషన్స్ లో ఉన్న నాని, సదరు అంశంపై కూడా స్పందించారు. “నా అభిమానులు ఇతర హీరోలపై సోషల్ మీడియాలో వల్గర్ కామెంట్స్ చేస్తానంటే నేను ఒప్పుకోను. అది తప్పని ఖచ్చితంగా వారికి చెప్తాను, హర్ట్ అయినా పర్వాలేదు, మేమే కరెక్ట్ అనే అభిమానులు నాకు అవసరం లేదు, అందరూ హీరోలు కూడా అభిమానులకు ఇలాగే చెప్పాలి” అంటూ అభిమానుల ధోరణి విషయంలో నాని తను తీసుకున్న నిర్ణయాన్ని ధైర్యంగా వెల్లడించారు.

నాని తీసుకున్న ఈ నిర్ణయం అభినందించదగ్గ విషయమే. ముఖ్యంగా సోషల్ మీడియా అనేది ప్రస్తుత కాలంలో అనివార్యం అయిన దరిమిలా… ఫ్యాన్స్ వార్ అనేది రచ్చ రచ్చగా మారిపోతోంది. ఈ నేపధ్యంలో… ఒక హీరోపై మరో హీరో అభిమానులు చెప్పలేని భాషతో స్పందిస్తున్న వైనం జుగుప్సను కలిగిస్తోంది. దీనికి అడ్డుకట్ట వేయని పక్షంలో ఈ ధోరణి మరింతగా పెరిగిపోయి, ఫ్యాన్స్ మధ్య వ్యక్తిగత విభేదాలు కూడా తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. అయితే నాని మాదిరి స్టార్ హీరోలు తమ అభిమానులను గైడ్ చేస్తారనుకుంటే మాత్రం అత్యాశే అవుతుందని చెప్పడంలో సందేహం లేదు.

ADVERTISEMENT
Latest Stories