జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నేడు ప్రత్యేకమైన రోజు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై, విమర్శల ప్రశంసలు అందుకున్న “నాన్నకు ప్రేమతో” వంటి డిఫరెంట్ సినిమా నేడు 100వ రోజుకు చేరుకుంది. ఇటీవల విడుదలైన “సర్ధార్ గబ్బర్ సింగ్” ఫ్లాప్ కావడంతో… చాలా ఏరియాల్లో సదరు ధియేటర్లలో నేడు ‘నాన్నకు ప్రేమతో’ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో 100 రోజులు అన్నది అసాధ్యం కావడంతో, కనీసం 100వ రోజైనా కొన్ని ఎంపిక చేసిన ధియేటర్లలో సినిమాలను ప్రదర్శించే ట్రెండ్ కు ‘నాన్నకు ప్రేమతో’ శ్రీకారం చుట్టింది.
దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నేడు ‘నాన్నకు ప్రేమతో’ ధియేటర్లలో సందడి సందడి చేయనున్నారు. ఓ వైపు సోషల్ మీడియాలో వంద రోజుల పోస్టర్ ను షేర్ చేసుకుంటూ హంగామా చేస్తూ… నేడు ప్రదర్శితం కాబోతున్న ధియేటర్ల వివరాలు తెలుపుతున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘బుడ్డోడు’ కెరీర్లో 25వ సినిమాగా ఒక ప్రత్యేక విశిష్టతను సొంతం చేసుకుంది. నేడు జూనియర్ అభిమానుల రచ్చకు నిలయమైతే, రేపు (శుక్రవారం) నందమూరి అభిమానుల హంగామాకు ముహూర్తం కుదిరింది.
తమ అభిమాన హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించబోయే 100వ సినిమా ప్రారంభోత్సవ వేడుకను హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు అతిరధ మహారధులు హాజరు కాబోయే ఈ వేడుక కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న “గౌతమీపుత్ర శాతకర్ణి” కధ చారిత్రాత్మక అంశాలతో కూడుకున్నది కావడంతో… టైటిల్ ప్రకటించిన నాటి నుండే ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి.



