మరో రెండు రోజుల్లో ‘యంగ్ టైగర్’ సినిమా ధియేటర్లలో సందడి చేయబోతోంది. దీంతో అభిమానులంతా “నాన్నకు ప్రేమతో” సినిమా ధియేటర్లను ఫ్లెక్సీలతో నింపేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ఎన్నడూ లేనంతగా భారీ అంచనాలు ఏర్పడడంతో మూడు, నాలుగు రోజుల ముందు నుండే ధియేటర్లను ముస్తాబు చేయడం అభిమానుల వంతయ్యింది. అంతేకాదు, ఆ ముస్తాబు చేసిన ధియేటర్ల ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులు కోలాహలం చేస్తున్నారు.
అయితే, ఏ ధియేటర్ వద్దనున్న ఫ్లెక్సీ చూసినా “నందమూరి నటసింహం” బొమ్మ కనపడకపోవడం గమనించదగ్గ అంశం. స్వర్గీయ నందమూరి తారక రామారావు, ‘సీతయ్య’ హరికృష్ణ, ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ మరియు ఆయన తనయుడు అభి ఫోటోలు మాత్రమే ఫ్లెక్సీలపై దర్శనమిస్తున్నాయి. వీరితో పాటు ఆయా అభిమానుల ఫోటోలు కనపడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణాలలో మాత్రమే కాదు, కర్ణాటకలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.
దీంతో “నాన్నకు ప్రేమతో” చిత్ర యూనిట్ నుండి అభిమాన సంఘాలకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయా? లేక ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న అభిమానగణం, పరిస్థితులను అర్ధం చేసుకుని వారంతట వారుగానే బాలకృష్ణ ప్రతిబింబాన్ని పక్కన పెట్టారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరో విశేషమేమిటంటే… బాలయ్య బొమ్మ తారసపడలేదు గానీ, అక్కడక్కడ ఏఎన్నార్, నాగార్జున, పవన్ కళ్యాణ్ లతో కూడిన “నాన్నకు ప్రేమతో ఫ్లెక్సీలు మాత్రం వెలిసాయి.








