ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్, శిరీషల వివాహం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు దంపతులు, పలువురు ప్రముఖులు వచ్చి వారిని ఆశీర్వదించారు.
నారా రోహిత్ సిఎం చంద్రబాబు నాయుడు సోదరుడు స్వర్గీయ నారా రామమూర్తి నాయుడు కుమారుడనే సంగతి తెలిసిందే. కనుక నారా రోహిత్ రాజకీయాలలోకి వస్తారనుకుంటే ఎవరూ ఊహించని విధంగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించి మంచి నటుడుగా తనకంటూ ఓ గుర్తింపు సాధించుకున్నారు.
జూ.ఎన్టీఆర్ కూడా రాజకీయ కుటుంబంలో జన్మించినవారే. కానీ అయన కూడా మొదటి నుంచి సినీ పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. మద్యలో టీడీపి కొరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొని మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ ఆ రాజకీయాల కంటే సినీ పరిశ్రమలోనే తన గమ్యం ఉందని తెలుసుకొని దానిలోనే కొనసాగుతూ మంచి పేరు, ప్రతిష్టలు సంపాదించుకున్నారు.
చిరంజీవి కూడా రాజకీయాలలోకి వచ్చి చేదు అనుభవాలు మూటగట్టుకొని గోడకు కొట్టిన బంతిలా మళ్ళీ తిరిగి సినీ పరిశ్రమలోకి వెళ్ళిపోయారు. ఉంగరం పోగొట్టుకున్న చోటినే వెతుక్కోవాలన్నట్లు, రాజకీయాలలో పోగొట్టుకున్న పేరు ప్రతిష్టలను మళ్ళీ సినీ పరిశ్రమలో పునరుద్దరించుకున్నారు.
కానీ ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చి ఆటుపోట్లన్నీ తట్టుకొని నిలబడగలిగారు. మంత్రి, ఉప ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ మళ్ళీ ‘ఓజీ’ అంటున్నారు. ఆయనకు సినిమాల ద్వారానే మొదట గుర్తింపు, అభిమానులు ఏర్పడ్డారు. ఆ తర్వాతే రాజకీయ నాయకుడుగా, మంత్రిగా గుర్తింపు, గౌరవం పొందుతున్నారు. కనుక ఈ జీవితానికి బలమైన పునాది వేసిన ఆ జీవితాన్ని కొనసాగించడమే చాలా మంచిదే.
పోసాని కృష్ణ మురళి సినిమాలలో చేసే కామెడీని అందరూ ఎంజాయ్ చేశారు. కానీ రాజకీయాలలో చేసిన కామెడీ మాత్రం వికటించింది. కనుక ఆయన పరిస్థితి రెంటికీ చెడిన రేవడిగా మారింది. అలీ కూడా రాజకీయాలతో గోక్కొన్నారు. కానీ రక్తం కారే అంత వరకు కాదు. దురద తీరే వరకు గోక్కొని సైలంట్ అయిపోయారు. కనుక నేటికీ సినిమాలు కూడా చేసుకోగలుగుతున్నారు.
వీరందరి ప్రయోగాలు, అనుభవాలను కలిపి చూసినట్లయితే నారా రోహిత్ ఒక్కరే ఎటువంటి ప్రయోగాలు చేయకుండా జాగ్రత్త పడ్డారు. కనుక ఆయన పద్దులో ఎదురుదెబ్బలు, చేదు అనుభవాలు కూడా ఏమీ లేవు.
కనుక సినీ పరిశ్రమలో ఉన్నవారు దూరపు కొండల్లా నున్నగా కనిపిస్తున్న రాజకీయాలను చూసి సులువుగా పైకి చేరుకోవచ్చని భ్రమ పడకుండా దూరంగా ఉంటేనే మంచిది.




