పెళ్లి చేసి చూడు పాత సామెత. సినిమా తీసి, రిలీజ్ చేసి చూపించు కొత్త నానుడి. చిన్న నిర్మాతలు ఉన్న కాసింత బడ్జెట్ లో తీయడం, వాటిని థియేటర్ల దాకా తీసుకొచ్చేందుకు అష్టకష్టాలు పడటం, మొదటి రోజు మార్నింగ్ షోకే జనాలు లేక మల్టీప్లెక్సులు షోలు క్యాన్సిల్ చేస్తున్న వైనం చూసి అయ్యో అనుకోవడం ప్రతి శుక్రవారం ఇదో ప్రోగ్రాంలా అయిపోయింది.
మొన్న గురు శుక్రవారాలు చాలా రిలీజులొచ్చాయి. పేరున్న హీరోలు కాబట్టి స్పై, సామజవరగమనలు మాత్రమే జనాలకు కనిపించాయి. కానీ మ్యాటర్ ఇంకా ఉంది. నాగార్జునతో సంతోషం లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు దశరధ్ కథనందించిన ‘లవ్ యు రామ్’ని ఎవరూ పట్టించుకోలేదు. ఉన్నంతలో టీమ్ ఏదో ప్రమోట్ చేసింది కానీ జనానికి రీచ్ కాలేదు.
పోనీలే టాక్ మీద పికప్ అవుతుందేమో అనుకుంటే చూసిన కాసింత మందీ పెదవి విరుస్తున్నారు. కొత్త జంటతో చేసిన ప్రయోగం ఫలించలేదు. సునీల్ లాంటి నోటెడ్ కమెడియన్స్ తో ‘మాయా పేటిక’ తీసుకొచ్చారు. ఎర్లీ ప్రీమియర్లు వర్కౌట్ అవుతున్నాయని దీనికీ రెండు రోజులు ముందే వేశారు. తీరా చూస్తే ఆ రెస్పాన్స్ తో పాటు జనాలు పల్చబడ్డారు.
క్యారెక్టర్ ఆర్టిస్టు దేవి ప్రసాద్, అప్ కమింగ్ హీరో సుధాకర్ కొమాకులతో ‘నారాయణ అండ్ కో’ అనే కామెడీ థ్రిల్లర్ వచ్చింది. ట్రైలర్ గట్రా పెద్దగా ఆసక్తి రేపకపోయినా ఎంటర్ టైన్మెంట్ తో నిలబడుతుందని నిర్మాతలు ఎదురు చూశారు. కానీ లాభం లేకపోయింది. వచ్చిన కాసింత పబ్లిక్ టాక్ కూడా సోసోగానే ఉంది.
విచిత్రంగా రీ రిలీజ్ కొచ్చిన తొలిప్రేమ, ఈ నగరానికి ఏమైందిలను యూత్ ఎగబడి చూస్తున్నారు. యూట్యూబ్, ఓటిటిలో ఫ్రీగా ఉన్నా సరే గుంపులుగా స్నేహితులతో వెళ్లి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇవి కాకుండా హిందీ సత్యప్రేమ్ కి కహాని, ఇంగ్లీష్ ఇండియానా జోన్స్ డయల్ అఫ్ డెస్టినీలు మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని తమవైపు లాక్కున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సినిమాలకు షోలు ఎలా దొరుకుతాయి. ఆ షోల తాలూకు ఖర్చులు, కమిషన్లు, అద్దెలు అన్నీ ప్రొడ్యూసర్ మీదే పడతాయి. ఓటిటిల కండీషన్లకు తలొగ్గో, నష్టమో లాభమో ఏదో ఒకటి చేసి చేతులు కడిగేసుకుందామనే తాపత్రయమో, తెరమీద పేరు చూసుకోవాలన్న లక్ష్యమో ఏదైతేనేం చితికిపోతున్న చిన్న నిర్మాత బ్రతకాలంటే రద్దీగా ఉన్న ఫ్రైడే మార్కెట్ లోకి అస్సలు కాలు పెట్టకూడదు.



