వందల కోట్ల బడ్జెట్ తో ప్యాన్ ఇండియా సినిమా తీస్తున్నప్పుడు వేసే ప్రతి అడుగు మీద టన్నుల కొద్దీ అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోవాల్సిందే. ఒక పోస్టర్ తోనే మెప్పించలేకపోతే అసలు కంటెంట్ మీద డౌట్ వచ్చే ప్రమాదం ఉంది. ఎంత ప్రభాస్ బొమ్మయినా సరే దేన్నీ తేలిగ్గా తీసుకోకూడదు. ప్రాజెక్ట్ కె ఫస్ట్ లుక్ మీద సోషల్ మీడియాలో నెగటివిటీ వచ్చిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
హాలీవుడ్ సంస్థ మార్వెల్ సిరీస్ సూపర్ హీరో గెటప్ కి ప్రభాస్ తల అతికించినట్టు ఉందని ఓపెన్ గానే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాన్ని రకరకాలుగా జూమ్ చేసి చిత్ర విచిత్రమైన ఎనాలిసిస్ చేస్తున్న వాళ్ళు వందల్లో ఉన్నారు. అసలే ఇది ఫాంటసీ మూవీ. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అని షూటింగ్ మొదలైనప్పటి నుంచి టీమ్ తెగ ఊరిస్తోంది. దానికి తగ్గట్టు ఫ్యాన్స్ ఆశించడం తప్పేమీ కాదు.
బాహుబలి తర్వాత దాన్ని మించే విజయాన్ని ప్రభాస్ అందుకోలేదు. మార్కెట్ పెరుగుతోంది కానీ సక్సెస్ గ్రాఫ్ కాదు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ మూడు కాస్ట్ ఫెయిల్యూర్స్ అయ్యాయి. సలార్ టీమ్ సైతం టీజర్ లో హీరో మొహం చూపించకుండా దోబూచులాడి యూట్యూబ్ వ్యూస్ రికార్డు దక్కించుకుంది కానీ అభిమానుల మనసులు కాదు. ఇదంతా ఎందుకు చేస్తున్నారో అంతు చిక్కని విషయం.
బాలీవుడ్ మీడియా మన మీద ఓరకంటగా చూస్తోంది. తమని డామినేట్ చేస్తున్న దక్షిణాది ఫిలిం మేకర్స్ ని దొరకబుచ్చుకోవాలని చూస్తోంది. ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఖాన్లు నటించిన డిజాస్టర్లను ఆకాశానికెత్తి మనవి రిలీజైనప్పుడు మాత్రం తప్పులు వెతికే పనిలో పడుతున్నారు. కేవలం సందీప్ రెడ్డి వంగా తీశాడనే కారణంతోనే కబీర్ సింగ్ ని తొక్కేయాలని చూశారు కానీ పనవ్వలేదు.
ప్రాజెక్ట్ కె క్రేజ్ నాగ అశ్విన్, అశ్వినిదత్ ల వల్ల రాలేదు. ప్రభాస్ అనే బ్రాండ్ నుంచి పుట్టింది. దాన్ని వీలైనంత ఎక్స్ పోజ్ చేస్తేనే జనం థియేటర్లకు పోటెత్తడానికి ప్రిపేర్ అవుతారు. ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి అనుసరించిన స్ట్రాటజీ చూశాంగా. చిన్న టీజర్ తో మొదలుపెట్టి మీడియా ప్రమోషన్ల దాకా ఆయన తీసుకునే శ్రద్ధ అపారం. అందుకే స్టేజిలు దాటేకొద్దీ హైప్ ఆకాశాన్ని దాటిపోయింది.
ఈ మరకంతా ఎల్లుండి వచ్చే టీజర్ తుడిచేయాలి. మనం గర్వంగా చెప్పుకునే లిస్టులో నాగ అశ్విన్ చేరాడనే ఫీలింగ్ కలగాలి. శాన్ డియాగోలో లాంచ్ చేయడం ఎంత ముఖ్యమో సత్తెనపల్లిలో ఉండే సగటు మాస్ కుర్రాడికి కిక్ ఇవ్వడం అంతకన్నా ముఖ్యం.ప్రభాస్ దర్శక నిర్మాతలు ఈ ప్రాధమిక సూత్రాన్ని మిస్ అవుతున్నారు. విగ్రహం ఎంత అందంగా ఉన్నా దానికి అలంకరణ చాలా ముఖ్యం.



