వైసీపీకి బాబాయ్-అబ్బాయ్ సెంటిమెంట్ అచ్చిరావడం లేదనిపిస్తోంది. బాబాయ్-అబ్బాయ్ అనగానే జగన్మోహన్ రెడ్డి-వివేకానంద రెడ్డే అందరికీ గుర్తొస్తారు. ఆ కధ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇది ఆ బాబాయ్-అబ్బాయ్ కధ కాదు. నెల్లూరులో రూప్ కుమార్ యాదవ్ బాబాయి, అనిల్ కుమార్ యాదవ్ అబ్బాయిల కధ!
ఇటీవల నెల్లూరు జిల్లాలో ఒకేసారి ముగ్గురు సీనియర్ నేతలను బయటకు సాగనంపడంతో వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో మిగిలినవారికి ఆ స్థానాలలో బలపడేందుకు అవకాశం లభించింది. ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన తర్వాత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు జిల్లాలో తన బలం పెంచుకొనేందుకు మంచి అవకాశం లభించినట్లయింది.
అందుకే ఆయన తరచూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ వచ్చే ఎన్నికలలో ఓడిస్తానని శపథాలు చేస్తుంటారు. అయితే అనిల్ కుమార్ యాదవ్‌కు సొంత బాబాయ్ రూప్ కుమార్ యాదవే ఎసరు సిద్దం చేస్తున్నారు.
అనిల్ కుమార్ యాదవ్ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు, ఆ తర్వాత మంత్రి అయ్యేందుకు కూడా ఆయన చాలా తోడ్పడ్డారు. కానీ వారిద్దరి మద్య అభిప్రాయబేధాలు వచ్చి ఒకరికొకరు దూరమయ్యారు. దాంతో రూప్ కుమార్ యాదవ్ నెల్లూరులో వేరేగా పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకొని, తన వర్గాన్ని బలపరుచుకొంటున్నారు. ఇంతకాలం అనిల్ యాదవ్ వెంట తిరిగిన వైసీపీ కార్యకర్తలలో అనేకమంది ఆయనను విడిచిపెట్టి రూప్ యాదవ్ పంచన చేరుతున్నారు.
ఇప్పటికే జిల్లాకు చెందిన ముగ్గురు సీనియర్ నేతలను బయటకు పంపించడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడింది. ఇప్పుడు అనిల్ యాదవ్, రూప్ యాదవ్ ఇద్దరి మధ్య దూరం పెరగడంతో పార్టీకి ఇంకా బలహీనపడుతోందని గమనించిన సిఎం జగన్మోహన్ రెడ్డి, ఇటీవల నెల్లూరులో పర్యటించినప్పుడు, వారిద్దరిని పిలిపించుకొని వారి చేతులు కలిపించారు. ఇద్దరూ అభిప్రాయభేదాలు పక్కనపెట్టి పార్టీ కోసం ఇదివరకులా కలిసికట్టుగా పనిచేయాలని జగన్ వారికి హితవు పలికారు.
అయితే జగన్ నెల్లూరు నుంచి తాడేపల్లి చేరుకొనేలోగానే, ‘కడుపులో లేనిది కావులించుకొంటే వస్తుందా… ఎట్టి పరిస్థితులలో నేను ఇకపై అనిల్ యాదవ్‌తో కలిసి పనిచేయడం అసంభవం’ అంటూ రూప్ యాదవ్ బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికలలో నెల్లూరు అర్బన్ నుంచి తాను పోటీ చేయాలనుకుంటున్నానంటూ మరో బాంబు పేల్చారు. ఒకవేళ అనిల్ కుమార్ యాదవ్‌తో తప్పనిసరిగా కలిసి పనిచేయవలసివస్తే పార్టీకి గుడ్ బై చెప్పాల్సివస్తుందని అనుచరుల వద్ద అన్నట్లు తెలుస్తోంది.
అంటే వచ్చే ఎన్నికలలో టికెట్ తనకే ఇవ్వాలని లేకుంటే పార్టీని వీడుతానని చెప్పిన్నట్లుగా అర్థమవుతోంది. కనుక అనిల్ కుమార్ యాదవ్ కోటంరెడ్డిని ఓడించడం సంగతి దేవుడెరుగు… ముందు బాబాయ్ తన సీటుకి ఎసరు రాకుండా కాపాడుకుంటే మంచిదేమో?



