ఇప్పటికే చెరిగిపోని రికార్డులను సొంతం చేసుకుని ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకున్న రాజమౌళి “బాహుబలి 2” నాలుగవ వారం వీకెండ్ నాటికి మరికొన్ని రికార్డులను కైవసం చేసుకోవడం ఖరారైంది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉన్న ‘బాహుబలి 2’ సినిమాకు పోటీ లేకుండా ఉండడంతో, ఈ అరుదైన రికార్డులను సొంతం చేసుకోవడం అన్నది లాంచనప్రాయమేనని ట్రేడ్ పండితులు బల్లగుద్ది చెప్తున్నారు.
యుఎస్ మార్కెట్ నుండి నుండి మొదలుపెడితే… బహుశా ఊహించడానికి కూడా సాధ్యపడని రీతిలో ఏకంగా 20 మిలియన్ డాలర్స్ క్లబ్ ను ‘బాహుబలి 2’ సృష్టించబోతోంది. ఇప్పటికే 19.10 మిలియన్ డాలర్స్ ను కొల్లగొట్టి, మరో 900కే డాలర్స్ దూరంలో ఉన్న ‘బాహుబలి 2’ మూడవ వారం ముగించుకుని, నాలుగవ వారం వీకెండ్ నాటికి పూర్తి చేసుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా ఒకటి, రెండు వారాల వరకే యుఎస్ మార్కెట్ లో ఏ సినిమా హంగామా అయినా ఉంటుంది. కానీ, ‘బాహుబలి 2’ మాత్రం మూడో వారం పోస్టర్ పడినా, ఆ హంగామా తగ్గలేదు.
ఇక, ఓవర్సీస్ నుండి ఇండియన్ మార్కెట్ కు వస్తే… బాలీవుడ్ లో కూడా రాబోయే వారాంతం ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతోంది. ఇప్పటివరకు 432.80 కోట్ల నెట్ ను అందుకున్న ‘బాహుబలి 2’ నాలుగవ వారం పోస్టర్ పడిన వీకెండ్ నాటికి 500 కోట్ల మార్కెట్ ను చేరుకోవడం తధ్యంగా చెప్పవచ్చు. లేటెస్ట్ వీకెండ్ లో శుక్ర, శని, ఆది వారాలకు గాను 42.55 కోట్లు వసూలు చేసిన ‘బాహుబలి 2’ ఇదే ట్రెండ్ ను మరో వారం పాటు కొనసాగిస్తే… బాలీవుడ్ మార్కెట్ చవిచూడని మార్క్ ను సృష్టించడం ఖాయం. బాలీవుడ్ లో 500 కోట్లు అనేది ఖాయం, అయితే అది వచ్చే వారాంతానికి పూర్తి చేస్తుందా? లేక మరికొద్ది రోజులు తీసుకుంటుందా? అన్నది ఆసక్తికరమైన అంశం.
బాలీవుడ్ నుండి టాలీవుడ్ కు వస్తే… తొలి 15 రోజులకు గాను 163.30 కోట్ల షేర్ ను కొల్లగొట్టిన ఈ సినిమా 25 రోజులు ముగిసే సమయానికి 200 కోట్ల క్లబ్ ను సృష్టించబోతుండడం దాదాపుగా ఖరారైన అంశం. ఇలా ఏ మార్కెట్ చూసినా ‘బాహుబలి 2’ ప్రభంజనమే కనపడుతోంది. ఓవరాల్ గా అయితే నాలుగవ వారం ముగిసే సమయానికి… అంటే దాదాపుగా తొలి 25 రోజులకు 1500 కోట్లను టచ్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఫిగర్ కు దాదాపుగా 150 కోట్ల దూరంలో ఉంది. సినిమా విడుదలకు ముందు వరకు 1000 కోట్లే చాలా ఎక్కువనుకుంటే… 1500 కోట్లను కూడా టచ్ చేస్తుండడం… ‘బాహుబలి 2’ చిత్ర యూనిట్ కు ప్రేక్షకులు అందించిన అపూర్వమైన విజయంగానే భావించాలి.



