మాములుగా కుర్ర హీరోలకు దూకుడెక్కువ. వేగంగా సినిమాలు చేసి పేరు డబ్బు సంపాదించేయాలని వరసగా ఒప్పేసుకుని కిందపడుతూ ఉంటారు. కేవలం ఈ కారణంగా బంగారం లాంటి కెరీర్లు త్వరగా ముగిసిపోయిన ఉదాహరణలు ఎన్నో. నువ్వే కావాలితో ఇండస్ట్రీ హిట్ సాధించిన తరుణ్ కు ఆ తర్వాత ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను లాంటి సూపర్ సక్సెస్ లు వచ్చినప్పటికీ ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయాడు. వరుణ్ సందేశ్ లాంటి వాళ్లకు ఎంత టాలెంట్ ఉన్నా స్క్రిప్ట్ సెలక్షన్ లో ఉన్న బలహీనత వల్ల పదేళ్లకే మాయం కావాల్సి వచ్చింది. సందీప్ కిషన్ కౌంట్ అయితే పెద్దదే కానీ బ్రేక్ కోసం ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాడు.
ఇప్పుడు వీళ్లందరి గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిఖిల్ ఇవన్నీ తెలిసే జాగ్రత్తగా మసలుకుంటున్నాడో లేక నిదానమే ప్రధానం సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడో తెలియదు కానీ కథల విషయంలో రాజీ పడకపోవడం తొందరపాటు అసలే లేకపోవడం మంచి ఫలితాలు ఇస్తోంది. ఇది పొగడ్త కాదు. వాస్తవిక కోణంలో ఆలోచిస్తే 2007లో ఇండస్ట్రీకి వచ్చిన నిఖిల్ ఈ పదిహేను సంవత్సరాల్లో ఇంకా పాతిక సినిమాలు కూడా పూర్తి చేయలేదు. అవకాశాలు రాక కాదు. లేక కాదు. హడావిడి పడటం వల్ల తాత్కాలిక ఆనందం తప్ప ఎక్కువ కాలం ఇండస్ట్రీలో గుర్తింపు ఉండదని తెలియడం వల్లే. అదే ఇప్పుడు మేలు చేస్తోంది.
2019లో అర్జున్ సురవరం హిట్టయ్యాక ఏకంగా రెండేళ్ల గ్యాప్ వచ్చింది. కార్తికేయ 2 మీద నమ్మకంతో దాని కోసం విపరీతమైన సమయం కేటాయించడం గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. ఊహించని విధంగా ఏకంగా ప్యాన్ ఇండియా గుర్తింపు తెచ్చేసింది. విడుదల తేదీలు ఒత్తిడి వల్ల మార్చాల్సి రావడం, సీతారామం,బింబిసారలు హిట్ అవ్వడం వల్ల తగినన్ని స్క్రీన్లు దక్కకపోవడం, ప్రమోషన్ల కోసం పరుగులు పెట్టాల్సి రావడం ఇవన్నీ మాములు సవాళ్లు కాదు. ఒకదశలో తన మాటలను వేరే కోణంలో అపార్థాలు తీసి ఏకంగా దిల్ రాజు మీద నిఖిల్ విమర్శలు చేశాడంటూ జరిపిన ప్రచారం కూడా ఇబ్బంది పెట్టింది. ఇన్ని జరిగినా కోరుకున్న ఫలితమే దక్కింది.
ఇదంతా ఇప్పుడు శుక్రవారం రాబోతున్న 18 పేజెస్ కు ఉపయోగపడుతోంది. కేవలం విలక్షణ కథలనే ఎంచుకుంటాడనే ప్రశంసను నిజం చేస్తూ ట్రైలర్ లో కొత్తదనం కనిపించింది. హీరో హీరొయిన్లు చూసుకోకుండా పరిచయం పెంచుకోవడం కొత్త పాయింట్ కాదు కానీ దానికి డిఫరెంట్ క్రైమ్ కాన్సెప్ట్ ని జోడించి అనుపమ పాత్రకు తొంబైల నాటి వింటేజ్ టచ్ ఇచ్చిన సుకుమార్ స్టోరీ డిఫరెంట్ గా అనిపిస్తోంది. అందుకే నిఖిల్ కంటెంట్ గురించి చాలా కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు. దర్శకుడు సూర్యప్రతాప్ టేకింగ్ లోనూ ఫ్రెష్ నెస్ కనిపిస్తోంది. మరి ఈ 18 పేజీలు కనక బాక్సాఫీస్ వద్ద హిట్టు ఇంకుతో నిండిపోతే ఏడాదిని నిఖిల్ రెండో ఆనందంతో ముగించొచ్చు.



