యంగ్ హీరో నితిన్ నటిస్తున్న భీష్మ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కలిగించాయి. విడుదల దగ్గరపడటంతో నితిన్ ప్రమోషన్స్ జోరు పెంచాడు.
కాసేపటి క్రితం ఆయన మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన తదుపరి చిత్రాల మీద క్లారిటీ ఇచ్చాడు నితిన్. ఇప్పటికే నాలుగు సినిమాలకు నితిన్ పచ్చ జండా ఊపాడట. ఈ సినిమాలతో నితిన్ రెండు మూడేళ్ళుగా బిజీబిజీగా గడపనున్నారు.
“రంగ్ దే సినిమా ఇప్పటికే షూటింగ్ జరుగుతుంది. ఆ సినిమా తరువాత చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం లో చెక్ అనే సినిమా చేస్తున్నా. హిందీలో విజయవంతమైన అంధధూన్ ని తెలుగులో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేస్తున్నా. ఆ తరువాత కృష్ణ చైతన్యతో పవర్ పేట రెండు భాగాలుగా తీయాలని ప్లాన్ చేస్తున్నాం,” అని నితిన్ అంటున్నాడు.
ఇది ఇలా ఉండగా…నితిన్ గత ఏడాది నటించిన ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు నిరాశపరిచాయి. ఆ మాటకొస్తే అ..ఆ తర్వాత నితిన్ కు సరైన సక్సెస్ లేదు. దీనితో నితిన్ మహాశివరాత్రికి విడుదలయ్యే భీష్మ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సారి తప్పకుండా సక్సెస్ అవుతానని కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నాడు.





