హైదరాబాద్ ను విశ్వనగరం గా మారుస్తానని చెబుతున్న తెలంగాణ ఐ.టి.శాఖ మంత్రి కేటీఆర్ ఆ హామీని నిలబెట్టుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరగాలంటే పరిశ్రమల స్థాపనకు నిలయమైన హైదరాబాద్ కు వచ్చే పారిశ్రామిక వేత్తలకు పూర్తిగా సహకారం అందించాలనే ఉద్దేశంతో పరిశ్రమలకు కావాల్సిన అనుమతుల విషయంలో ఇప్పటికే సింగిల్ విండో పాలసీని అమలు చేస్తున్న కేటీఆర్ తాజాగా సామాన్య ప్రజానీకానికి సంబంధించిన అంశాలలో కూడా సింగిల్ విండో విధానంతో ముందుకెళ్ళాలని అన్ని ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ లో ఇంటి నిర్మాణానికి అవసరమైన అనుమతులు కూడా వెంటనే మంజూరు చేసేలా విధివిధానాలు ఖరారు చేసారు. ఇక నుండి భాగ్యనగరంలో వ్యాపార సంస్థలకు ప్రారంభానికి, ఇంటి నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం ప్రజలు కాళ్ళరిగేలా ప్రభుత్వ సంస్థల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
“ప్రభుత్వ సంస్థల ముందు క్యూ లైన్ల లో నిలబడాల్సిన పని లేదు” అని మంత్రి కేటీఆర్ ప్రజలకు అభయమిస్తున్నారు. ఇటువంటి అన్ని అనుమతులకు ప్రజలు ఎక్కడికి వెళ్ళకుండానే కేవలం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చనే తీపి కబురు చల్లగా చెప్పారు.‘హైటెక్’ మంత్రిగా తన మార్క్ హైదరాబాద్ లో చాటుకోవడానికి కేటీఆర్ చేస్తున్న ఇటువంటి పనుల వల్ల పారిశ్రామిక వేత్తలే కాదు, సామాన్య ప్రజలు కూడా హర్షిస్తున్నారు.



