ఆన్‌లైన్ షాపింగ్… కొంటున్నామా? కొనిపిస్తున్నారా?

Online shopping offers trigger impulse buying

ఒకప్పుడు ఏదైనా వస్తువు కొనాలంటే నిజంగా అవసరం ఉందా లేదా? అని ఒకటికి రెండుసార్లు ఆలోచించేవారు. కానీ ఆన్‌లైన్‌ షాపింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

చాలా మంది ‘లిమిటెడ్ టైమ్ ఆఫర్’, ‘ఫ్లాష్ సేల్’ వంటి ప్రకటనలు చూసి ‘ఆన్‌లైన్‌ షాపింగ్ సైట్ల’లోకి ప్రవేశిస్తుంటారు. అక్కడ 50, 70% డిస్కౌంట్, బై వన్ గెట్ వన్ వంటివి టక్కున ఆకర్షిస్తాయి.

ADVERTISEMENT

అప్పుడు ఆ వస్తువు మనకి అవసరమా కాదా? అనే ఆలోచన కంటే ఆన్‌లైన్‌లో లభిస్తున్న ఆ ఆఫర్ చేజార్చుకోవడం దేనికి? అనే ఆలోచనతో నాలుగైదు క్లిక్స్ చేస్తే చాలు బ్యాంక్ ఖాతాలో నుంచి డబ్బు బయటకు వెళ్ళిపోతుంది. అవసరం లేని వస్తువు ఇంటికి వచ్చేస్తుంది. రెండు రోజుల ముచ్చట తర్వాత అది ఏ మూలకో వెళ్ళిపోతుంది. నేడు దేశవ్యాప్తంగా చాలా ఇళ్ళలో జరుగుతున్నదే ఇదే.

ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారుల మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకున్నాయి. ‘ఇంకా ఇద్దరు ఈ వస్తువును చూస్తున్నారు’, ‘స్టాక్ చాలా తక్కువ’ ‘ఇప్పుడే కొనండి’, ‘ ఇప్పుడే కొంటే ఇంత డిస్కౌంట్’ ‘ప్రత్యేక ఆఫర్’ వంటి సందేశాలు చూస్తున్నప్పుడు, వెంటనే కొనకపోతే ఏదో కోల్పోతామనే భావన కలుగుతుంది. ఈ మానసిక స్థితినే మార్కెటింగ్ భాషలో ‘ఫోమో’ అంటారు.

అలాగే ‘బై వన్ గెట్ వన్ ఫ్రీ’, ‘బై టూగెట్ త్రీ’ వంటి ఆఫర్లు కూడా చాలామందిని ఆకర్షిస్తాయి. నిజానికి మనకి ఒక వస్తువే అవసరమైనప్పుడు, ఉచితంగా వస్తోందనే ఆశతో రెండో వస్తువును కొనేస్తాం. కానీ ఒకేసారి వాళ్ళు మనకి రెండు వస్తువులు అంటగడుతున్నారని, రెంటికీ కలిపే మన దగ్గర నుంచి డబ్బు వసూలు చేస్తున్నారని ఎంత మంది గ్రహిస్తారు?

అసలు ఒక వస్తువు కొంటే మరొకటి నిజంగానే ఉచితంగా ఇస్తే ఆ కంపెనీలు దివాళా తీయకుండా ఉంటాయా? కానీ ఉచితంగా పంచిపెట్టేస్తున్నా లాభాలు ఆర్జిస్తున్నాయంటే అర్థం ఏమిటి?

ఇప్పుడు ఆన్ని ఆన్‌లైన్‌ సంస్థలు అరువు కూడా ఇస్తున్నాయి. అరువులో మళ్ళీ వాయిదాల వెసులుబాటు కూడా కల్పిస్తున్నాయి. కనుక బ్యాంకులో ఒక్క రూపాయి లేకపోయినా అరువు మీద అనవసరమైన వస్తువులు కొనేసి తర్వాత తాపీగా బాధపడేవారు కోకోల్లలున్నారు.

ఆన్‌లైన్‌లో డబ్బు, సమయం అన్నీ ఆదా అవుతున్నాయని అనుకుంటారే కానీ అవసరం లేని వస్తువులు కొంటూ డబ్బు వృధా చేసుకుంటున్నామని గ్రహించకపోతే నెలాఖరున ఎవరి ముందో చెయ్యి జాపాల్సిందే.

ఆన్‌లైన్‌లో కొన్న వస్తువు చేతికి అందినప్పుడు కలిగే ఆనందం కొన్ని నిమిషాలే. కానీ నెలాఖరులో క్రెడిట్ కార్డ్ బిల్లు లేదా బ్యాంక్ ఖాతాలో ఇంటి అవసరాలకు సరిపడా బ్యాలెన్స్ లేకపోతే అప్పుడు ఆందోళన మొదలవుతుంది.

ఆఫర్ ఉంది కాబట్టి కొనడం, కంటే అవసరం ఉంది కాబట్టి కొనడమే ముఖ్యం అని తెలుసుకోవాలి. ఒక వస్తువు నిజంగా అవసరమా కాదా? తెలియాలంటే ఒక వారం పది రోజులు లేదా నెలరోజులు దానిని కొనడం వాయిదా వేస్తే మీకే తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories