‘మనం’ సినిమాతో మళ్ళీ మొదలైన ‘కింగ్’ నాగార్జున సినీప్రస్థానం దినదిన ప్రవర్ధమానంగా కొనసాగుతోంది. తాజాగా విడుదలైన “ఊపిరి” సినిమా ప్రోమోలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో నాగ్ ‘హ్యాట్రిక్’ హిట్ అందుకోవడం ఖాయంగా కనపడుతోంది. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణకు విచ్చేసిన అతిధులంతా కూడా ఇదే రకమైన భావాన్ని వ్యక్తపరిచారు.
ఇక, ‘కింగ్’ మాట్లాడుతూ… “తానూ మొదటి నుండి ‘సాహసమే శ్వాసగా సాగిపో’ అనే సిద్ధాంతాన్ని నమ్మానని, అందుకే విభిన్నమైన సినిమాలను ఎంపిక చేసుకోగలుగుతున్నానని, ఆ క్రమంలోనే ఓ హాలీవుడ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ‘ఊపిరి’ సినిమా కూడా అద్భుతంగా వచ్చిందని, వీల్ చైర్లో కూర్చున్నానని తన పాత్రపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని, చైర్ లో కూర్చున్నా, మనసంతా ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటుందని” అభిమానులకు తన పాత్రపై ఓ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసారు ‘కింగ్.’
ఈ ‘ఊపిరి’లో నవ్విస్తాం, ఏడిపిస్తాం, సంతోషపెడతాం… ఇలా ప్రతి అంశంలోనూ ఈ సినిమా మనసుకు హత్తుకునేలా ఉంటుందని, జీవితంలో ఎవరో ఒకరు తోడుంటే అన్ని కష్టాలు పోతాయని, ఈ సినిమా చెప్పేది కూడా అదేనని అన్న నాగ్, “ఊపిరి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, అయితే ఈ సినిమాలో నటించడం వలన కార్తి రూపంలో తనకు ఓ తమ్ముడు దొరికాడని, కార్తి ఎంత బాగా చేసారో తానూ మాట్లాడానని, అయితే కార్తితో ఏర్పడ్డ బంధం మరిచిపోలేనని నాగ్ వ్యాఖ్యానించారు.
ఈ సినిమా సంగీత దర్శకుడు గోపి సుందర్ ప్రసంగిస్తూ… “మలయాళంలో తానూ ఒక సినిమా చూసి హిట్ అని చెప్తే, అవి ఖచ్చితంగా హిట్ అవుతుందని, అదే నమ్మకంతో ఇపుడు ‘ఊపిరి’ కూడా మంచి విజయం సాధిస్తుందని, ఓ మెగా హిట్ అవుతుందని, మరో రెండు, మూడు సినిమాలకు తానూ కూడా పూర్తి తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను అని చెప్పిన మరికొద్ది సమయానికే “ఊపిరి” ఆడియో వేడుక ముగిసింది.



