ఇటీవల ఒరాకిల్ కంపెనీ ఉద్యోగులు తెల్లవారుజామున వచ్చిన ఈమెయిల్స్ చూసి షాక్ అయ్యారు. వారిని ఉద్యోగాలలో నుంచి తొలగిస్తున్నట్లు ఈమెయిల్ ద్వారా తెలియజేయడమే ఇందుకు కారణం.
అలాంటి కంపెనీలో వైట్ కాలర్ ఉద్యోగాలంటే వారి జీతాలు, ఖర్చులు, విలాసాలు, ఈఎంఐలు, పాలసీలు మామూలుగా ఉండవు. నిజానికి ఒరాకిల్ మాత్రమే కాదు దాదాపు అన్ని ఐటి, సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
ఉద్యోగంలో ఉన్నప్పుడు విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది. కనుక ఆ ప్రభావం శారీరిక, మానసిక ఆరోగ్యంపై కూడా పడుతూనే ఉంటుంది. ఈ పని ఒత్తిడి కారణంగా భవిష్యత్ గురించి ఆలోచన చేసేందుకు వారికి తగినంత సమయం ఉండదు.
ఉద్యోగంలో ఉన్నప్పుడే ఇంత ఒత్తిళ్ళు భారిస్తున్నప్పుడు, ఆ ఉద్యోగం కాస్తా పోతే? అనే ఆలోచనే ‘చావు’ అంత భయం కలిగిస్తుంది. కనుక చాలా మంది అలాంటి మాటలు వినడానికి కూడా ఇష్టపడరు. కానీ మనం వద్దన్నా ‘చావు’ ఆగనట్లే తెల్లారిలేచే సరికి ఉద్యోగాలు ఊడిపోవచ్చు.
ఆరోగ్యానికి హెల్త్ పాలసీ, చావుకి జీవిత భీమా పాలసీలు తీసుకునే చాలా మంది, ఉద్యోగాలుపోతే ఎలా బ్రతకాలి?అనే ఆలోచన, ప్లానింగ్ చేసుకోరు.
అదృష్టం బాగుండి వెంటనే వేరే ఉద్యోగం దొరికితే అదృష్టమే కానీ దొరకకపోతే అంతకాలం ‘హ్యాపీ ఫ్యామిలీ’, ‘హ్యాపీ లైఫ్’ అనుకున్నదే నరకంలా మారిపోతుంది.
కనుక నేటి ఏఐ జమానాలో ఉద్యోగం పోతే మన పరిస్థితి ఏమిటి?అని తప్పనిసరిగా ఆలోచించడం చాలా అవసరం. కార్లు, ఇళ్ళు, విలాసాలపై ఖర్చు చేసే బదులు ముందుగా తగినంత బ్యాంక్ బ్యాలన్స్, టంచన్‌గా వడ్డీ లేదా ఆదాయం వచ్చే ఫిక్స్ డిపాజిట్స్ లేదా స్కీమ్స్‌లో పెట్టుబడి పెడుతుండాలని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆర్ధిక భద్రత ఇలాంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడేందుకు ధైర్యం కలిగిస్తుంది.






