వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరియు అదే పార్టీ ఎమ్మెల్యే రోజా ప్రధాన పాత్రలలో సినిమా తెరకెక్కిస్తే బాగుంటుందనే వినూత్నమైన ఆలోచన ఏపీ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ మరియు టిడిపి నేత అయిన పంచుమర్తి అనూరాధకు వచ్చింది. ఈ సినిమాకు డైరెక్టర్ తో పాటు టైటిల్ కూడా అనూరాధే ప్రకటించారు. బహుశా ఈ టైటిల్ వింటే… నిజంగా జగన్ కు, రోజాకు ఇంతకంటే సూట్ అయ్యే టైటిల్ మరొకటి ఉండదని చెప్పడంలో సందేహం లేదు.
ఇంతకీ టైటిల్ ఏంటో తెలుసా… అదేమీ అనురాధ సృష్టి కాదు గానీ, ఓ సినిమాలో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ నే జగన్ – రోజాల సినిమాకు టైటిల్ గా నిర్ణయించి, దానిని విశ్లేషించారు కూడా! “అతిగా ఆవేశపడే ఆడది – అతిగా ఆశపడే మగాడు” అన్న టైటిల్ తో రోజా, జగన్ కలిసి సినిమా చేస్తే చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జగన్ ఏమో ముఖ్యమంత్రి కావాలనే అత్యంత ఆశాపరుడని, రోజా ఏమో ఆవేశంలో ఎలాంటి భాషనూ వినియోగించాలో కూడా తెలియదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇక ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం అన్ని విజయసాయిరెడ్డి అందిస్తే బాగుంటుందని అన్నారు. సంకలో బిడ్డను పట్టుకుని ఊరంతా తిరిగినట్టు, తన చుట్టూరా మద్యం వ్యాపారులను పెట్టుకున్న జగన్, ఏపీ సర్కార్ అనుసరిస్తున్న మద్యం విధానాలపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదని, జగన్ చెప్తున్న కట్టుకధలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, రాష్ట్రాన్ని బాగుచేస్తామంటూ తొమ్మిది హామీలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని తేల్చేసారు అనురాధ.



