ప్రేమ మాటలతో వివరించలేని ఓ గొప్ప అనుభూతి. అది అనుభవించినవారికే అది అర్ధమవుతుంది. ఆ ప్రేమతో కలిగే ఆ అద్భుతమైన అనుభూతిని కోల్పోతే అది కూడా మాటలకు అందని విషాదమే. ఆ విషాదం తీవ్రత ఒక్కొక్కరి మానసిక పరిస్థితిని బట్టి ఒక్కో స్థాయిలో ఉంటుంది.
కొందరు ఆడవాళ్ళు ‘మూవ్ ఆన్’ అంటూ ముందుకు సాగిపోతారు. మరికొందరు ఆ బాధ, తిరస్కరణ భరించలేక ఆత్మహత్య చేసుకొనేందుకు వెనకాడరు. మగవాళ్ళయితే మందు కొట్టి మరిచిపోయే ప్రయత్నం చేస్తారు లేదా హర్జిందర్ సింగ్ వంటి వాళ్ళయితే తనని కాదన్న ప్రియురాలిని కత్తితో పొడిచి చంపి ఆత్మహత్య చేసుకుంటారు.
పంజాబ్‌లోని పటియాలలో హర్జిందర్ సింగ్ (39), డింపుల్ (30) ఇద్దరూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ప్రేమలో పడ్డారు. మూడేళ్ళ తర్వాత మనస్పర్ధలు వచ్చి బ్రేకప్ చెప్పుకున్నారు. అప్పటి నుంచి ఆమె అతనికి దూరంగా ఉంటోంది. అది సహజమే కానీ అది భరించలేక హర్జిందర్ సింగ్ గురువారం సాయంత్రం ఆమె పనిచేసుకుంటున్న చోటికి వచ్చి కత్తితో పొడవబోయాడు.
ఆమె తప్పించుకొని పారిపోతుంటే వెంబడించి ఆఫీసులో అందరూ చూస్తుండగానే కత్తితో 20సార్లు పొడిచి దారుణంగా హత్య చేశారు. ఆఫీసులో సహచరులు అతనిని అడ్డుకోబోతే వారిని కత్తి చూపించి బెదిరించడంతో అతనిని పట్టుకొని ఆపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
అందరూ చూస్తుండగానే ఆమె రక్తపు మడుగులో చనిపోయింది. ఆ తర్వాత అతను అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని అదుపులోకి తీసుకొని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కానీ అతని పరిస్థితి విషమంగా ఉంది.
ప్రేమ ఓ గొప్ప అనుభూతి… కానీ దానికి ఇలాంటి విషాదకరమైన ముగింపు అవసరమా?




