ఏపీతో పోలిస్తే తెలంగాణ ముస్లిం ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. కనుక అక్కడ ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న మజ్లీస్ పార్టీతో అవగాహన, సహాయసహకారాలు తప్పనిసరి. గతంలో కేసీఆర్, ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా అందుకే మజ్లీస్ అధినేతలతో సఖ్యతగా ఉంటారు.
ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేనని విస్తరించాలనుకోవడంతో అయన ఏ విధానం ఎంచుకోబోతున్నారు? అనేది ఆసక్తికరం. ఆయనకు ప్రధాని మోడీ, బిజేపి పెద్దలతో మంచి సఖ్యత ఉంది. ఏపీలో జనసేన, బిజేపి, టీడీపిలు కలిసి పనిచేస్తున్నాయి. పైగా సనాతన ధర్మం అంటూ బిజేపి హిందుత్వ విధానంలోనే సాగుతున్నారు. కనుక తెలంగాణలో బిజేపి పద్దతిలోనే పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయాలనుకుంటే ముస్లిం ఓటర్లు దూరం అవుతారు.
ఓ సినీ నటుడుగా, నిష్కళంక చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడుగా, ముఖ్యంగా సామాన్య ప్రజల సమస్యలపై స్పందించే మానవతావాదిగా పవన్ కళ్యాణ్‌కి తెలంగాణలో కూడా మంచి పేరుంది. దానిని కాపాడుకొని ముస్లింలతో సహా అన్ని వర్గాల ప్రజల ఆదరణ పొందాలనుకుంటే తెలంగాణలో బిజేపికి పూర్తిగా దూరంగా ఉండాల్సి ఉంటుంది.
తెలంగాణ బిజేపి నేతలు జనసేనతో పొత్తులు అవసరం లేదని చెపుతూనే ఉన్నారు. కనుక అయన బిజేపికి దూరంగా తన పద్దతిలో కొనసాగాలనుకుంటే, లౌకికవాద రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. కానీ బిజేపితో ఆయనకున్న సంబందాలు జనసేన విశ్వసనీయతని ప్రశ్నార్ధకంగానే ఉంచుతాయి.
ఒకవేళ బిజేపితో కలిసి దాని పద్దతిలో హిందుత్వ అజెండాతో పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయాలనుకుంటే, మొట్ట మొదట తనని అభిమానించే ముస్లిం యువతని దూరం చేసుకోవాల్సి ఉంటుంది. బిజేపితో కలిసి సాగినట్లయితే తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ వంటి పార్టీలను, తెలంగాణ పేరుతో రాజకీయాలు చేసేవారిని పవన్ కళ్యాణ్ ధైర్యంగా ఎదుర్కోవవచ్చు. వారు కూడా పవన్ కళ్యాణ్ జోలికి వచ్చేందుకు ఆలోచించాల్సి వస్తుంది.
బిజేపితో జనసేన కలిసి సాగినట్లయితే బిజేపితో చేతులు కలిపి మళ్ళీ అధికారంలోకి రావాలనే బీఆర్ఎస్ పార్టీకి పవన్ కళ్యాణ్ అడ్డుగోడలా మారుతారు.
కనుక పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేనని ఏ పద్దతిలో నడిపించబోతున్నారనేది చాలా ఆసక్తికరం.




