‘వెంకీ పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు’ అన్న సామెత వినే ఉంటారు కదా. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తోన్న ఉదంతం ఈ సామెతను జ్ఞప్తికి తెచ్చేలా చేస్తోంది. ‘భీమ్లా నాయక్’ సినిమాను వాయిదా వేసిన తర్వాత దర్శకదిగ్గజం తమ హీరోకు సరైన రీతిలో కృతజ్ఞతలు చెప్పలేదని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యి, సోషల్ మీడియాలో చేసిన రచ్చ తెలియనిది కాదు.
ఇప్పుడిదే హీరో నాని సినిమా మెడకు చుట్టుకుంటోంది. రాజమౌళి పూర్తి పేరు ఎస్.ఎస్.రాజమౌళి కాగా, సింపుల్ గా షార్ట్ కట్ లో ‘ఎస్ఎస్ఆర్’ అని పిలుస్తూ ఉంటారు. సినిమా పోస్టర్లపై లోగోలో కూడా ‘ఎస్ఎస్ఆర్’ అనే ఉంటుంది. మరో 48 గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా షార్ట్ కట్ కూడా ‘ఎస్ఎస్ఆర్’గానే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
‘ఎస్ఎస్ఆర్’ అని పేరు వచ్చింది కాబట్టి ఈ పేరు తమకు నచ్చడం లేదని, బుక్ చేసుకున్న టికెట్లను కూడా క్యాన్సిల్ చేసుకున్నామని పవన్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో ‘భీమ్లా నాయక్’ వాయిదా వ్యవహారం ప్రత్యక్షంగా నాని సినిమాకు తగిలినట్లవుతోంది. అయితే ఈ ఉదంతంలో పవన్ అభిమానుల మెచ్యూరిటీ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.
ఇదే ఇప్పుడు ట్రోల్ కు కూడా గురవుతోంది. రాజమౌళి పేరులో ఉన్న ‘ఎస్ఎస్ఆర్’ మూడు అక్షరాలను పూర్తిగా వదిలేయాల్సింది కదా అని నెటిజన్లు ఇస్తున్న కౌంటర్లు అనేకం. పవన్ ఫ్యాన్స్ మరో బాధ ఏమిటంటే… అత్త కొట్టిన దానికి కాదు, తోడుకోడలు నవ్వినదానికి అన్న చందంగా ఉంది. పవన్ కంటే కాస్త ఎక్కువ గౌరవమిస్తూ మహేష్ పేరుతో ట్వీట్ వేయడం జీర్ణించుకోలేని అంశంగా మారింది.



