పవన్ ఫ్యాన్స్… నష్టపోతోంది మీ హీరోనే..!

Pawan Kalyan -fans
తెలుగు హీరోలను అభిమానులు దేవుళ్లుగా భావిస్తారు. గుండెల్లో పెట్టుకోమంటే ఏకంగా నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. ఏ హీరో అభిమానులు వాళ్ళ హీరోను అభిమానించడంలో తప్పు లేదు, ఆయా హీరోల సినిమాలు బాగున్నా, లేకున్నా ఒకటికి పది సార్లు చూడడంలో తప్పు లేదు. అది ఎవరి ఇష్టం వారిది.

కానీ ఒక హీరో వేడుక జరుగుతుంటే, అక్కడికి వచ్చేసి ‘మా హీరో గురించి చెప్పండి’ అని అనడం లేక జరుగుతున్న వేడుకతో సంబంధం లేకుండా స్లోగన్స్ వినిపించడం అనేది ఎంతవరకు సమంజసమో సదరు అభిమానుల విజ్ఞతకే వదిలేయాలి. ఇదంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ADVERTISEMENT

ఇది పవన్ కున్న అశేష అభిమాన గణానికి వర్తించదు గానీ, ఏ ఫంక్షన్ జరుగుతున్నా, అందులో ‘పవర్ స్టార్’ స్లోగన్స్ వినిపించి, ఆ వేడుకలను ఇబ్బందిపాలు చేసే అభిమానులకైనా, ఆ అభిమానులకు అండగా ఉండి ఇలాంటి వాటిని ప్రోత్సహించే ఎంతటి వారికైనా ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. దీనికి ఏ దర్శకుడైనా, నిర్మాతైనా, ఇంకెవరైనా అతీతులు కారు.

“ఆర్ఆర్ఆర్” ముంబై ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ జెండాలు పట్టుకుని చేసిన హంగామా హాట్ టాపిక్ కావడంతో, పవన్ అభిమానుల అంశం మరోసారి లైంలైట్ లోకి వచ్చింది. ఇదంతా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారో లేక తమ హీరోకు మరింత పబ్లిసిటీ చేద్దామని చేస్తున్నారో గానీ, ప్రతిసారి ఒక్క పవన్ ఫ్యాన్స్ విషయంలోనే ఈ చర్చ జరుగుతోంది.

నిజానికి ఇలాంటి ఉదంతాలతో పవన్ కళ్యాణ్ కు జరుగుతున్న మేలు కన్నా, నష్టమే ఎక్కువని పవన్ ఫ్యాన్స్ గుర్తించడం లేదు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఉన్నారు గనుక, ఇది మరింత నష్టాన్ని చేకూర్చే అంశంగా మారిపోతోంది. ఒక ముఖ్యమంత్రి కావాలంటే అన్ని వర్గాల నుండి ఆదరణకు నోచుకోవాలన్న కనీస పరిజ్ఞానం కొరవడడం శోచనీయం.

పవన్ ఫ్యాన్స్ చేస్తోన్న ఇలాంటి రచ్చతో ఇతర హీరోల అభిమానులు విసిగిపోతున్నారు. ఈ ప్రభావం పవన్ సినిమా రిలీజ్ అయిన రోజు సోషల్ మీడియాలో నెగటివ్ టాక్ కు కారణం అవుతోంది. ఒకవేళ సినీ అంశాన్ని చాలా తేలికగా తీసుకున్నా, పొలిటికల్ గా మాత్రం పవన్ ను ఇతర హీరోల అభిమానుల నుండి ఇది బాగా దూరం చేసే అంశం.

దీనిని గుర్తించకుండా పదే పదే ఇలాంటి చర్యలకు పాల్పడితే, అది ఎంతగానో అభిమానించే పవన్ కళ్యాణ్ కే తీవ్ర నష్టాన్ని కానుకగా ఇస్తున్నారని గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా గ్రహించారు కాబట్టే, ఇటీవల కాలంలో ఫ్యాన్స్ చేస్తోన్న రచ్చకు గానీ, స్లోగన్స్ కు గానీ, నినాదాలకు గానీ వ్యతిరేకంగా స్పందిస్తున్నారు, వారికి అవగాహన కలిగే విధంగా మాట్లాడుతున్నారు.

అభిమానించే హీరోనే స్వయంగా చెప్తున్నా లెక్క చేయకపోతే ఇంకా ఆ అభిమానానికి అర్ధం ఉంటుందా? ‘మీ వలన కదూ నేను ఇలా ఉన్నది,’ ‘మీరు ఇక్కడ అరుస్తారు, అక్కడ ఓటేస్తారు,’ ‘ఇలా అరిస్తే సీఎం అయిపోను, వచ్చి ఓటు వేయాలి’ అంటూ అభిమానులను ఉద్దేశించి వివిధ సందర్భాలలో పవన్ పంచ్ లు వేస్తూ చెప్పినా, అందులో అంతరార్ధం ఫ్యాన్స్ కు అర్ధం కావడం లేదా? బహుశా అభిమానం బలహీనతగా మారితే ఇలానే చేస్తారేమో!?

ADVERTISEMENT
Latest Stories