పుష్ప బెనిఫిట్ షో వివాదంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిది తప్పులేదంటూ వ్యాఖ్యానించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో. అయితే గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ సినీ పరిశ్రమకు మాత్రం దూరమవ్వలేదు పవన్.
అయితే సంధ్యా థియేటర్ ఘటనతో టాలీవుడ్ vs తెలంగాణ ప్రభుత్వం అన్నట్టుగా తెలుగు చిత్ర ప్రముఖులందరూ బన్నీకి మద్దతుగా నిలబడి పరోక్షంగా టి. ప్రభుత్వానికి శత్రువులుగా మారారు. దీనితో అసలు తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఇక్కడ బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేదేలే అంటూ తెగేసి చెప్పారు రేవంత్ రెడ్డి.
దీనితో సంక్రాంతి రిలీజ్ కు దగ్గరైన భారీ సినిమాలు తెలంగాణ ప్రభుత్వం నుండి ఈ బినిఫిట్ ను పొందే అవకాశాన్ని కోల్పోయారు. అసలే శంకర్ దర్శకత్వంలో వస్తున్నరామ్ చరణ్ గేమ్ ఛేంజర్ బడ్జెట్ ఆకాశాన్ని తాకింది అనే టాక్ ట్రేడ్ వర్గాలలో నడుస్తుంది. ఈ నేపథ్యంలో టికెట్ రేలా విషయంలో హైక్ రాకపోయినా, బెనిఫ్ట్ షో ల రూపంలో అదనపు ఆదాయం అందక పోయినా, సినిమా టాక్ అటు ఇటుగా వచ్చినా దాని తాలూకా ప్రభావం రామ్ చరణ్ పై ఖచ్చితంగా పడుతుంది.
RRR తరువాత రామ్ చరణ్ మెయిన్ లీడ్ లో వస్తున్న మూవీ కావడం, ఆచార్య డిజాస్టర్ తరువాత వస్తున్న మూవీ కావడంతో గేమ్ ఛేంజర్ మీద అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టే చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా మీద మరింత హైప్ ఇస్తుంది. దానికి తోడు తన సహా నటులైన ఎన్టీఆర్ దేవర, బన్నీ పుష్ప వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వేట కొనసాగించడం గేమ్ ఛేంజర్ ముందు చాల పెద్ద టార్గెట్ లే నిలిపాయి.
ఈ నేపథ్యంలో ఏపీలో పర్యటించిన దిల్ రాజు ఇక్కడి ఉప ముఖ్యమంత్రి పవన్ తో మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఇక పై తెలంగాణలో సినిమాల విడుదలకు ఎటువంటి అదనపు బెనిఫిట్స్ ఇవ్వబోమన్న రేవంత్ రెడ్డి పై ఎవరు ఊహించని కామెంట్స్ చేసారు.
రేవంత్ రెడ్డి తన కష్టంతో తానూ కింద నుండి ఎదుగుతూ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన గొప్ప నాయకుడు. చట్టం ముందు అందరు సమానమే అనేదాన్ని రేవంత్ ఆచరించారు, అంతే కానీ తన పేరు మరిచిపోయారనో, తనను గుర్తించలేదనో ఈరకమైన కక్ష్య పూరిత చర్యలకు రేవంత్ దిగుతారని భావించడం లేదన్నారు.
అలాగే వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైస్ జగన్ అనుసరించినట్టు తెలుగు చిత్ర పరిశ్రమకు నష్టం చేకూరేలా రేవంత్ ఎటువంటి చర్యలకు దిగలేదని, రేవంత్ సర్కార్ టికెట్ రేట్ల పెంపు నిర్ణయంతో, బెనిఫిట్ షో ల అనుమతితో టాలీవుడ్ కు మంచే చేసిందని, దాని ఫలితంగానే సలార్, పుష్ప వంటి సినిమాలు భారీ వసూళ్లు సాధించాయన్నారు.
అయితే రేవంత్ పై ఈ రకమైన ప్రశంసల వెనుక పవన్ ముందాలోచన ఏమైనా ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు రేవంత్ రెడ్డి ని ఎవరు ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదని, అతనికి సెలబ్రెటీలు ఎవరు తగిన గౌరవం కూడా ఇవ్వడం లేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసి ఈ వివాదాన్ని పెంచి పెద్దది చేసింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి, టాలీవుడ్ వన్ ఆఫ్ ది స్టార్ హీరో పవన్ కళ్యాణే స్వయంగా రేవంత్ ను ఒక గొప్ప నాయకుడిగా ప్రశంసిస్తూ ప్రకటనలు చేస్తుంటే రేవంత్ సినీ పరిశ్రమ పట్ల తీసుకున్న నిర్ణయాలలో కాస్త వెనకడుగు వేస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఈగో ను సంతృత్తి పరిచడానికే పవన్ తెలంగాణ ముఖ్యమంత్రి ని ఈస్థాయి పొగడ్తలతో ముంచెత్తారా.?
పవన్ ప్రశంసలు తెలంగాణలో గేమ్ ఛేంజర్ కు ప్రభుత్వంతో ఉన్న అడ్డంకులను తొలగించగలుగుతుందా.? రామ్ చరణ్ మూవీ కలెక్షన్ల విషయంలో పవన్ వ్యాఖ్యలు ప్రభావం చూపించబోతున్నాయా.? తన కోసం పిఠాపురం వరకు వచ్చిన తనయుడు రామ్ చరణ్ కోసం పవన్ తెలంగాణ ప్రభుత్వ పెద్దల వరకు వెళ్ళి గేమ్ ఛేంజర్ కు అదనపు బెనిఫిట్స్ తీసుకువస్తారా.? అనే ప్రశ్నలకు సమాధానం కోసం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.




