జనసేన అధినేత మరియు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వైసీపీ దాడి షురూ చేసింది. తాజాగా మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఒక హీరోగా లేక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ అంటే తమకు భయం లేదని కీలక వ్యాఖ్యలు చేసారు.
అసలు పవన్ కళ్యాణ్ ఎవరు? మహా అయితే ఏడాదికో సినిమా చేస్తాడు, అందరిలాగానే అతను ఒక స్టార్ హీరో, నిజంగా చెప్పాలంటే ఆయన సినిమాకు అల్లు అర్జున్ సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయా? అంటూ పవన్ ను కార్నర్ చేసే విధంగా మాట్లాడారు పేర్ని నాని.
అలాగే చిరంజీవి, రామ్ చరణ్, మహేష్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లు పవన్ కంటే మంచి సినిమాలు చేస్తున్నారు, నా చిన్నప్పుడు ఎపుడో ‘అత్తారింటికి దారేది’ సినిమా ఒక్కటి బాగా ఆడింది, దానిని చూసే ఇప్పటికి తన సినిమాలను అమ్ముకుంటున్నాడు అంటూ పవన్ రేంజ్ ను ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ కంటే తర్వాత వచ్చిన హీరోలు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయన కంటే పెద్ద స్థాయిలోనే ఉన్నారు, ఆయన కంటే మంచి సినిమాలే చేస్తున్నారు. పేద వాళ్లకు ఇబ్బంది కలుగకుండా, ఇండస్ట్రీకి సముచితంగా ఉండేలా టికెట్ ధరలు ఉండబోతున్నాయని పేర్ని నాని చెప్పుకొచ్చారు.
ఇంతలా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు పవన్ బదులిస్తారా? ఎందుకంటే మరో వారంలో రోజుల్లోనే జనసేన అధినేత నరసాపురంలో ఓ బహిరంగ సభను పెట్టబోతున్నారు. ఈ సభలో పేర్ని నానిపై మరియు జగన్ లపై మండిపడే విధంగా వ్యాఖ్యలు చేయనున్నారా?
దీనికి జవాబు దొరకాలంటే 20వ తేదీ వరకు వేచిచూడాలి. అయితే టాలీవుడ్ ఎదురు చూస్తోన్న టికెట్ ధరల జీవో బయటకు వచ్చేటంత వరకు టికెట్ ధరల గురించి వైసీపీ సర్కార్ పై దాడి చేయకపోవచ్చని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే ‘రిపబ్లిక్’ వేదికపై తాను మాట్లాడిన దాని వలనే సమస్య ఇంత పెద్దదైందనే ఒక వాదన ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఒకవేళ పవన్ ఏదయినా కీలక వ్యాఖ్యలు చేసి వైసీపీని కార్నర్ చేస్తే, టికెట్ ధరల జీవో మరింత ఆలస్యం అయితే దానికి ప్రత్యక్షంగా పవనే కారణం అయ్యారన్న విమర్శలు మళ్ళీ ఊపందుకుంటాయి. టాలీవుడ్ శ్రేయస్సు దృష్ట్యా టికెట్ ధరల అంశం గురించి పవన్ ప్రస్తావించకపోవచ్చని బలంగా వినిపిస్తోన్న టాక్. ఈ దిశగా ఇప్పటికే ఇండస్ట్రీ నుండి పవన్ కు వినతులు కూడా వెళ్లినట్లుగా తెలుస్తోంది.
ఓ విధంగా చెప్పాలంటే వైసీపీ ఎంతగా విమర్శలు చేసినా, టికెట్ ధరలపై స్పందించకుండా టాలీవుడ్ ప్రముఖులు పవన్ చేతులు కట్టేసినట్లుగా సమాచారం. ఓ జనసేన అధినేతగా పొలిటికల్ పరంగా వైసీపీపై ఎన్ని విమర్శలు చేసుకున్నా పర్లేదు గానీ, సినీ ఇండస్ట్రీని మాత్రం ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేసినట్లుగా టాక్.



