పెద్ద సినిమాల వాయిదాల పర్వంతో ఈ దసరా సినీ ప్రేక్షకుల సరదా తీర్చేస్తుందన్న భావనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ప్రస్తుత టాలీవుడ్ టాప్ హీరోలైన మహేష్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ల సినిమాలు ఒకే నెలలో విడుదల కాబోతున్నాయన్న టాక్ తో ఆయా అభిమాన హీరోలలో కూడా నూతన ఉత్సాహం ఉరకలేసింది. అయితే ముగ్గురి టాప్ హీరోల సినిమాలు ఒకే నెలలో విడుదల కావడం ఎంత అసాధ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ఏ హీరో వెనక్కి తగ్గుతారో అన్న ఆసక్తి నెలకొన్న నేపధ్యంలో… ట్రేడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లే!
ముందుగా విడుదల కానున్నది జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ” చిత్రం కాగా, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అప్ డేట్స్ ఇవ్వలేదు. కానీ ట్రేడ్ టాక్ ప్రకారం సెప్టెంబర్ 1వ తేదీన ఈ సినిమా పక్కా అన్న సమాచారం అయితే ఉంది. ఇక అత్యంత ఆసక్తికరంగా మారిన పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు సినిమాలు వారం రోజుల వ్యవధిలో లేదంటే నాలుగు రోజుల వ్యవధిలో విడుదల కావచ్చని ఇప్పటివరకు హల్చల్ చేసిన టాక్. మహేష్ ‘స్పైడర్’ ఇప్పటికే అనేక వాయిదాలు పడడంతో, ఈ సినిమా ఇంకా వాయిదా వేస్తే… అసలుకే మోసం వచ్చే విధంగా మారే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.
కాబట్టి సెప్టెంబర్ 27వ తేదీన దసరా సందర్భంగా ప్రేక్షకుల సరదా తీర్చేందుకు “స్పైడర్” సిద్ధమవుతోందన్నది ఖరారైన విషయం. ఇక తప్పని పరిస్థితులలో… పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల సినిమా వెనక్కి జరిగినట్లుగా లేటెస్ట్ న్యూస్. అయితే వాయిదా అంటే భారీ వాయిదా కాకుండా ఒక నెల పాటు వాయిదా వేసే విధంగా ప్లానింగ్ జరుగుతోందట. ప్రస్తుతం అనుకున్న అంశాలు అన్ని అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 18వ తేదీన పవన్ – త్రివిక్రమ్ ల సినిమా విడుదల కావచ్చన్నది తాజా సమాచారం. దీంతో ఈ ముగ్గురు హీరోల సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా మారింది.
సెప్టెంబర్ 1వ తేదీన “జై లవకుశ” సినిమా ఏమైనా రికార్డులు సృష్టిస్తే… వాటిని ‘స్పైడర్’తో పోల్చిచూడడం సహజమే. అలాగే ‘స్పైడర్’ ఖాతాలో ఉన్న రికార్డులతో పవన్ సినిమా పోటీపడడం స్పష్టం. ఇలా రోజుల వ్యవధిలో అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం కావడంతో సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు సినీ ప్రేక్షకుల పాలిట వరాలుగా మారబోతున్నాయి. ఈ మూడింటి నడుమ తాను కూడా ఉన్నానంటూ తాజాగా “పైసా వసూల్”గా సెప్టెంబర్ 29వ తేదీ నాటికి నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా వాయిదా పడడం ఖాయమన్న టాక్ సినీ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.



