ఓ పిట్టల దొరా… ఎక్కడున్నావయ్యా?

Pittala Dora folk artist performing traditional storytelling during Sankranti in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సంక్రాంతి పండుగకు జరిగే కోడి పందాల గురించి అందరికీ తెలుసు. గంగిరెద్దులు, హరిదాసుల గురించి తెలుసు. కానీ ‘పిట్టల దొర’ల గురించి ఎంతమందికి తెలుసు? అంటే జవాబు చెప్పడం కష్టం.

సినిమాలు వచ్చిన తర్వాత నాటక రంగం, హరికధలు, బుర్రకధలు కనుమరుగు అయినట్లే, పూట గడవక క్రమంగా పిట్టల దొరలు కూడా మాయం అయ్యారు.

ADVERTISEMENT

సినిమాలలో బాలకృష్ణ లేదా చిరంజీవి గుక్కతిప్పుకోకుండా గడగడ డైలాగులు చెపితే చప్పట్లు కొట్టే ప్రజలు, తమ ఇంటి ముందుకు వచ్చి పిట్టల దొరలు గుక్క తిప్పుకోకుండా చెప్పే గొప్పలను గొప్పగా చూడలేకపోతున్నారు! ఆ కళాకారులను కేవలం బిచ్చగాళ్ళుగానే చూస్తుంటారు.

నెత్తిపై టోపీ, చేతిలో కర్ర తుపాకీ పట్టుకొని ఇంటింటికీ తిరిగే ‘పిట్టల దొరలు’ తామే పాకిస్తాన్‌ సైనికులను ఒంటి చేత్తో ఓడించేశామని చెప్తారు.

ఈ అంబానీలు, ఆదానీలు తమ ముందు దిగదుడుపే అంటారు. కోనసీమలో కొబ్బరితోటలు, భీమవరంలో రొయ్యల చెరువులున్నాయని చెప్పుకుంటారు. తాటాకులతో వేసిన ఇంద్రభవనం వంటి తమ ఇంటిలో నిత్యం వేలాదిమందికి అన్నదానాలు జరుపుతూనే ఉంటామని చెప్పుకుంటారు.

దేశవ్యాప్తంగా తమ కంపెనీలలో లక్షలాది మంది ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటున్నామని చెపుతారు. తమకు డబ్బుకు కరువు లేదని కానీ చిల్లరకి ఇబ్బందిగా ఉండటంతో మీ ఇంటి ముందు నిలబడి అడుగుతున్నామని చెప్పుకుంటుంటే మనసు ఆర్ద్రత చెందకుండా ఉంటుందా?

ఓ సినిమాలో హీరోకి ఇలాంటి పంచ్ డైలాగులు, చైన్ డైలాగులు వ్రాస్తే అది చాలా గొప్ప విషయం. ‘రప్పా రప్పా తల నరుకుడు’ డైలాగులకు కూడా అపూర్వమైన ప్రజాధరణ లభిస్తోంది.

కానీ పెద్దగా చదువుకొని మన పిట్టల దొరలు ఎవరినీ నొప్పించకుండా పండగకి అందరూ హాయిగా నవ్వుకునేలా ఇలాంటి గొప్పలు (డైలాగులు) వ్రాసుకోవడం గొప్ప విషయం కాదా?

సుమారు 10-15 నిమిషాల సేపు గుక్క తిప్పుకోకుండా ఒకటే టేకులో వాటిని ఆశువుగా చెప్పడం గొప్ప విషయం కాదా? కానీ ఈ పిట్టల దొరలని వారి కళని మనం ఎందుకు గుర్తించడం లేదు?జోలి పట్టుకొని ఇంటి ముందుకు వచ్చి నిలబడుతున్నందున ముష్టివాళ్ళుగా పరిగణిస్తుండటం వలననే కదా?

ఈ పిట్టల దొరలకు తెలుసు ఈ కబుర్లతో కుటుంబం గడవదని. కానీ వంశపారంపర్యంగా వస్తున్న ఈ కళని కాపాడుకోవాలనే తాపత్రయంతో సంక్రాంతి పండుగకు దర్శనమిస్తుంటారు. ఈ కళపై వారికున్న ప్రేమ, నిబద్దతలే ఈ దీనిని ఇంకా సజీవంగా ఉంచిందని వేరే చెప్పక్కరలేదు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికే ప్రత్యేకమైన ఈ కళని, ఈ కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వానికి ఉండాలి కదా? ముఖ్యంగా ప్రజలు తమ ఇంటి ముందుకు వచ్చిన ఈ అరుదైన గొప్ప కళాకారులను గుర్తించి, గౌరవిస్తూ అంతరించిపోతున్న ఈ కళని కాపాడుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories