పోలవరంతో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌పై మళ్ళీ ఒత్తిడి… తప్పదు!

Polavaram vs Kaleshwaram projects

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు 2027లో పూర్తి చేస్తామని ప్రకటించిన వెంటనే. వైసీపీ దానినీ తమ పద్దులో జమా చేసుకుంటూ, “జగన్‌ కృషి వల్లనే ప్రాజెక్టులోని 48 రేడియల్ స్పిల్‌వే గేట్ల ద్వారా దాదాపు 12 లక్షల క్యూసెక్కుల గరిష్ఠ వరద ప్రవాహాన్ని తట్టుకునేలా నిర్మాణం జరిగింది

ఇప్పుడు స్పిల్‌వే వద్ద నీటి మట్టం +34.150 మీటర్లకు, ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం +34.450 మీటర్లకు చేరుకున్నా చెక్కుచెదరని వైఎస్సార్ పోలవరం,” అని సోషల్ మీడియాలో ప్రకటించుకుంది.

ADVERTISEMENT

దాని క్రెడిట్ కోసం ఆరాటపడుతూ వైసీపీ పెట్టిన ఈ పోస్టుపై వచ్చిన వెటకారాలు, విమర్శలను పక్కన పెడితే, పోలవరం ప్రాజెక్టు వరద ఉదృతిని తట్టుకొని ధృడంగా నిలబడిందని తొలిసారిగా వైసీపీ ఓ సానుకూలమైన మాట పలికినందుకు చాలా సంతోషం.

పోలవరం నిర్మాణానికి దశాబ్దాలు పట్టినా దీని ద్వారా అటు రాయలసీమ జిల్లాలకు, ఇటు కృష్ణా డెల్టా, ఉత్తరాంధ్ర జిల్లాలకు తాగుసాగు నీటి సమస్యలని శాశ్వితంగా తీర్చబోతోంది.

ఆంధ్రాకు ఎగువనున్న తెలంగాణలో కూడా నీటి కొరత ఉంది. కనుకనే మాజీ సిఎం కేసీఆర్‌ సుమారు లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు.

దానిలో మొట్టమొదటి మేడిగడ్డ బ్యారేజ్‌..85 గేట్లతో మూడేళ్ళలోనే నిర్మించారు. కానీ కేసీఆర్‌ అధికారంలో ఉండగానే దానిలో మూడు పియర్స్ క్రుంగిపోయాయి. కనుక గేట్లు మూసి దానిలో నీటిని నిలువచేస్తే మరిన్ని పియర్స్ దెబ్బ తినవచ్చని నిపుణుల బృందం హెచ్చరించడంతో అంత పెద్ద బ్యారేజ్ నిరుపయోగంగా మారింది.

దాని దిగువనున్న అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నిర్మాణాలు కూడా నాసిరకం జరిగినందున మూడేళ్ళ క్రితమే గోడలు బీటలువారి నిరుపయోగంగా మారాయి.

ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు వచ్చే ఏడాది పోలవరం పూర్తిచేసి నీళ్ళు అందిస్తానని ప్రకటించడంతో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలపై మళ్ళీ ఒత్తిడి పెరుగుతుంది.

పోలవరం వరద నీటి విడుదల సామర్థ్యం 50 లక్షల క్యూసెక్కులు కాగా, ఇటీవల 14.8 లక్షల క్యూసెక్కుల నీళ్ళు దిగువకు విడుదల చేశారు. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్‌ల గేట్లు మూసి నీటిని నిలువచేయలేని దుస్థితి నెలకొంది. కనుక వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడిచిపెట్టక తప్పడం లేదు.

వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ మూడు బ్యారేజీలకు మరమత్తులు చేసి మళ్ళీ అందుబాటులోకి తెస్తుందో లేదో తెలీదు. కానీ వచ్చే ఎన్నికలకు ముందు ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టులో నీళ్ళు పారుతాయి.

తెలంగాణ ప్రజలు తప్పక ఈ తేడా గమనిస్తారు. కనుక వచ్చే తెలంగాణ ఎన్నికలలో కాళేశ్వరంతో పాటు ఆంధ్రాలోని పోలవరం కూడా కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల భవితవ్యం నిర్దేశించే అవకాశం ఉందనిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories