కేసీఆర్‌, జగన్‌, కేటీఆర్‌ కామన్ పాయింట్!

Political Arrogance in Leaders

కేసీఆర్‌, జగన్‌, కేటీఆర్‌ ముగ్గురిలో ఓ కామన్ పాయింట్ కనిపిస్తుంది. అదే అహంభావం. నోటి దురుసు.

సాధారణంగా రెండోసారి ముఖ్యమంత్రి, మంత్రి పదవి చేపట్టినవారికి చాలా మందికి కొమ్ములు వచ్చేస్తుంటాయి. అహంకారం పెరిగి అందరినీ చులకనగా చూస్తుంటారు.

ADVERTISEMENT

కానీ జగన్‌కి మొదటిసారి మొదటి రోజు నుంచే కొమ్ములు వచ్చేశాయి. అధికారంలోకి రాగానే ఆయన కంటికి తల్లీ చెల్లీ కానరాలేదు. ఆయన ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు నిమిత్తమాత్రులుగా మిగిలిపోయారు. చివరికి చంచల్ గూడాకు కూడా వెన్నంటి వచ్చిన విజయసాయి రెడ్డిని కూడా దూరం చేసుకున్నారు.

తండ్రి పేరు, ఫోటో పెట్టుకొని ప్రజలలో ఇంత గుర్తింపు, అధికారం సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి, తండ్రిలో ప్రజలు మెచ్చిన మంచి లక్షణాలు, గుణాలను అలవరుచుకోలేకపోయారు. “మా అన్న జగన్‌ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు” అని వైఎస్ షర్మిల మొన్నే చెప్పారు.

దురహంకారంతో రాజకీయంగా నష్టపోయి, తన పార్టీకి నష్టం కలిగించుకున్నారు. జగన్‌ తండ్రి నుంచి ఏమీ నేర్చుకోలేదు. కానీ వైసీపీ నేతలలో చాలా మంది జగన్‌ నుంచి ప్రతీ అవలక్షణం అలవరుచుకున్నారు. అందువల్లే వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్లు, కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. జైళ్ళకు వెళ్ళివస్తున్నారు.

కేసీఆర్‌ మొదటిసారి సిఎం పదవి చేపట్టగానే తనతో భుజం భుజం కలిపి తెలంగాణ కోసం పోరాడిన ప్రొఫెసర్ కోదండరామ్‌ వంటి వారిని అవమానించారు.

రెండోసారి పదవి చేపట్టినప్పుడు గద్దర్‌ని గేటు బయట కూర్చోబెట్టారు. ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి వంటి పలువురు సీనియర్లను దూరం చేసుకున్నారు. పదవి, అధికారం కోల్పోయిన తర్వాత కూతురు కల్వకుంట్ల కవితని మెడ పట్టుకొని బయటకు గెంటేశారు.

కేసీఆర్‌కి బలం బలహీనత రెండూ కూడా ఆయన నోరు… నోటి మాటే. అదే ఆయనని ముఖ్యమంత్రిని చేసింది… దించేసింది….అని తెలిసి ఉన్నా కూడా విదేశాలలో ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు చేసి వచ్చానని గొప్పగా చెప్పుకునే కేటీఆర్‌ కూడా తండ్రి బాటలోనే సాగుతున్నారు.

కేటీఆర్‌ తండ్రి బాటలో నడుస్తూ అహంకారంతో ముఖ్యమంత్రిని ‘హౌలే గాడు’ అంటారు. పోలీస్ అధికారులను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఇతరులు తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తుంటారు.

తన అహంకారంతోనే ప్రజలలో తన పట్ల వ్యతిరేకత పెరిగేలా చేసుకుంటూ కేటీఆర్‌ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు. తండ్రిలాగే అహంకారంతో వ్యవహరిస్తూ తన పార్టీని తానే కూలద్రోసుకుంటున్నారని చెప్పక తప్పదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అందరికీ తెలుసు. కానీ నోరు మంచిది కాకపోతే ఊరు కూడా మంచిది కాదని ముగ్గురూ నిరూపించి చూపుతున్నారు కదా?

ADVERTISEMENT
Latest Stories