ఒకప్పుడు పవర్ స్టార్ పాత్రలో కనిపించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌గా మరో సరికొత్త పాత్రలో కనిపిస్తున్నారు.
ఆయన సోదరుడు చిరంజీవి విఫలమైన చోటే పవన్ కళ్యాణ్ జనసేనతో తన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. నిజానికి అంత దగ్గరగా అటువంటి చేదు అనుభవాన్ని చూసి మరొకరైతే రాజకీయాలలోకి రావాలనే ఆలోచన కూడా చేయరు. కానీ చేశారు. అప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని తప్పు పట్టారు. వారించారు. విమర్శించారు.
ఈ పదేళ్ళ ప్రస్థానంలో ఆయనకు ఎదురు దెబ్బలు, చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఒకానొక సమయంలో జనసేన పార్టీని నడిపించడానికే సినిమాలు చేయాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితులలో మరొకరైతే మనకెందుకీ రాజకీయాలు అని వదిలేసేవారే?కానీ పవన్ కళ్యాణ్ ముందుకే సాగారు.
అవమానాలు, అవహేళనల విషయంలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను సరిపోల్చుకోవచ్చు. కానీ వాటితోనే వారిద్దరూ రాజకీయాలలో రాటు తేలారు.
చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఆయన వద్దకు వెళ్ళి సంఘీభావం తెలపడమే కాక అక్కడికక్కడ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటన చేశారు. తద్వారా రాష్ట్ర ప్రజల మనసులను గెలుచుకోగలిగారు. జగన్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తేలా చేశారు.
ఆ తర్వాత బీజేపి, టీడీపీలను కూడా కలిపి బలమైన కూటమి ఏర్పాటు అయ్యేందుకు తన వంతు కృషి చేసి, పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పు తెచ్చారు. అంతే కాదు.. ప్రభుత్వం మార్పుతో రాష్ట్రాన్ని, ప్రజలను కూడా జగన్ బారి నుంచి కాపాడారు.
సినిమాలలో పవర్ స్టార్‌గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్, డెప్యూటీ సిఎంగా కూడా ప్రజలలో అంతకంటే మంచి గుర్తింపే సంపాదించుకుంటున్నారు. సగటు రాజకీయ నాయకులలో కనిపించే అహంభావం, డాబు, దర్పం వంటివాటికి పవన్ కళ్యాణ్ చాలా దూరంగా ఉంటూ నిరాడంబరంగా సామాన్య ప్రజలతో కలిసిపోగలగడం, పదవి అధికారం చేతిలో ఉన్నా ఇంకా ఆయన మాటలలో, చేతలలో నీతి నిజాయితీ నిబద్దత కనిపిస్తుండటమే ఇందుకు కారణమని చెప్పవచ్చు.
పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడం లక్షలాదిమంది అభిమానులకు ఎంత సంతోషం కలిగించిందో, ఆయనలోని ‘పవర్ స్టార్’ని మిస్ అవుతునందుకు వారికి అంతే బాధ కూడా కలిగిస్తోంది. కనుక పవన్ కళ్యాణ్‌ని రాజకీయాలలో చూడాలనుకుంటున్నారా లేక సినిమాలలో చూడాలనుకుంటున్నారా?అంటే సినిమాలలోనే అని అభిమానులు చెప్తారు.
కానీ ఈ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ ‘రాజకీయాలలోనే ఉండాలని అనుకుంటున్నానని’ చెపుతుంటారు. సినిమాలతో అభిమానులను, ప్రేక్షకులను వినోదింపజేయవచ్చు. అదే రాజకీయాలలో.. ఇలా పదవిలో ఉంటే సామాన్య ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చగలనని అనుకోవడమే ఇందుకు కారణం.
డెప్యూటీ సిఎం, మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ పూనుకొని అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో మారుమూల గ్రామాలకు రోడ్లు వేయించడమే ఇందుకు తాజా నిదర్శనం.
కనుక ప్రజలను అలరించడం కోసం సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్, ప్రజల కోసమే సినిమాలను త్యాగం చేశారని చెప్పొచ్చు. కనుక 2024లో ఆయన రాజకీయ ఎదుగుదల సంతోషం కలిగిస్తుండగా, రాజకీయాల కోసం సినిమాలకు దూరమవడం అభిమానుల చాలా బాధ కలిగిస్తుండవచ్చు. కానీ ఒకటి లభిస్తే మరొకటి త్యాగం చేయకతప్పదు కదా?






