అఖిల్ అక్కినేని నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శరవేగంగా ముస్తాబు అవుతుంది. వేసవి కనుక ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇది ఇలా ఉండగా సినిమా ప్రమోషన్స్ కూడా పెంచారు. తాజాగా సినిమాలో పూజా హెగ్డే ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ట్రెండీ మోడరన్ లుక్ లో పూజా యువతను ఆకట్టుకునేలా ఉంది.
అఖిల్ సరసన నటిస్తున్న మొట్టమొదటి స్టార్ హీరోయిన్ పూజానే అని చెప్పుకోవాలి. ఇప్పటివరకూ అఖిల్ సినిమాలలో యువ హీరోయిన్లే ఉండేవారు. కథ ప్రకారం సూట్ అయ్యే వారే అయినా వారి వల్ల ఒక పెద్ద సినిమాకు రావాల్సిన గ్లామర్ రావడం లేదు. ఇప్పుడు ఆ లోటు పూజా భర్తీ చేస్తుంది. పైగా ఇప్పుడు ఆమెకు ఆడియన్స్ లో ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు.
2013లో ‘ఒంగోలు గిత్త’ తర్వాత కనిపించకుండా పోయిన బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు అఖిల్ సినిమా చేస్తున్నాడు. కేరీర్ లో ఒక్క హిట్ కూడా లేని టైం లో భాస్కర్ వంటి అవుట్ అఫ్ ది ఫామ్ దర్శకుడితో నటించడం అంటే సాహసం అనే అనుకోవాలి. ఈ సారైనా అఖిల్ సరైన హిట్ సాదిస్తాడేమో చూడాల్సి ఉంది.
అయితే గీత ఆర్ట్స్ సంస్థకు చెందిన జీఏ2 పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. గత కొంత కాలంగా ఈ సంస్థ హిట్లకు చిరునామాగా మారింది. ఈ సంస్థ భలే భలే మగాడివోయ్ తో నానికి, ప్రతి రోజూ పండగే తో సాయి ధరమ్ తేజ్ కు, గీత గోవిందంతో విజయ్ దేవరకొండకు తమ కెరీర్ బెస్ట్ హిట్లు ఇచ్చింది. దీనితో అక్కినేని అభిమానులు ఈ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నారు.





