రామాయణం ఇప్పటికి కొన్ని వందల వేల సార్లు టీవీ సీరియల్స్, సినిమాల రూపంలో మనల్ని పలకరించింది పలకరిస్తూనే ఉంది. బాపు గారు వెండితెరపై చూపించినా, రామానంద్ సాగర్ బుల్లితెరపై ఆవిష్కరించినా, ఎన్టీఆర్ బాలకృష్ణలు రాముడిగా మెప్పించినా ఆ కథలో ఉన్న గొప్పదనం అలాంటిది. బోర్ కొట్టడమనే ప్రస్తావన రాదు. చూసేసిందే కదాని జనం విసుక్కున్న దాఖలాలు లేవు. అందుకే ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా హీరోతో టి సిరీస్ సంస్థ వందల కోట్ల బడ్జెట్ తో ఆది పురుష్ ని ప్రకటించినప్పుడు అందరూ ఎగ్జైట్ అయ్యారు.
ఇది అనౌన్స్ చేసేనాటికి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వాడి తీస్తున్నదని చెప్పలేదు. నటీనటులందరూ ప్రతి సీన్ లో నటించి జీవిస్తారనే అనుకున్నారు. కానీ తీరా చూస్తే దీని సరంజామా వేరే. అప్పట్లో రజనీకాంత్ విక్రమసింహని ఇదే తరహాలో చేస్తే ఆడియన్స్ తిరస్కరించారు. దానికి వాడిన సాంకేతిక చాలా తక్కువ స్థాయిది. కానీ అది పురుష్ కి ఆ ఇబ్బంది లేదు. ఎంతైనా ఖర్చు పెడుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కి కావాల్సిన హావభావాలు, కీలక సన్నివేశాలకు సంబంధించిన రియల్ టైం షూటింగ్ నిజమైన క్యాస్టింగ్ తోనే చేశారు.
తీరా చూస్తే టీజర్ తో మొదలుకుని శ్రీరామనవమి కొత్త పోస్టర్ దాకా ఏదీ ఎగ్జైటింగ్ గా లేదు. అసలు వేషధారణే విమర్శలకు గురవుతోంది. సీతా రాములే కాదు గతంలో సైఫ్ అలీ ఖాన్ రావణుడి హెయిర్ స్టైల్, హనుమంతుడి సైన్యం తాలూకు విజువల్స్ అన్నీ కామెంట్స్ బారిన పడ్డవే. అయినా పదే పదే అవే పొరపాట్లు రిపీట్ అవుతున్నాయి. ఆది పురుష్ తో ఏదో కొత్త చరిత్ర లిఖిస్తారనుకుంటే ఇలా ఉన్న ఆసక్తిని తగ్గించేయడం ఏమిటని అభిమానులు మండిపడుతున్నారు. వీళ్ళెంత మొత్తుకున్నా అక్కడ ఎవరూ పట్టించుకునేలా లేరు.
టీజర్ కు వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని దృష్టిలో ఉంచుకుని చాలా మార్పులు చేస్తున్నారని దానికి వంద కోట్లు కేటాయించారని ఏవేవో కబుర్లు చెప్పారు కానీ జూన్ 16న థియేటర్లలో చూస్తే కానీ ఏది నిజమో ఏది అబద్దమో నిర్ధారణకు రాలేం. ప్రభాస్ ఇమేజ్ క్యాష్ చేసుకునే తాపత్రయం బాలీవుడ్ సంస్థల్లో ఎక్కువగా కనిపిస్తోంది. సాహోని ఈ అత్యుత్సాహమే దెబ్బ తీసింది. రాధే శ్యామ్ కి డ్యామేజ్ చేసింది. సంగీత దర్శకుల విషయంలో తీసుకున్న నిర్ణయాలు హిందీ వెర్షన్లను ఎంత నెగటివ్ చేశాయో చెప్పనక్కర్లేదు. మరి చిరకాలం గుర్తిండిపోయేలా ఈ ఆదిపురుష్ కైనా పాటలు చేయించారో లేదో. కనీసం ఒక్క సాంగ్ అయినా రిలీజ్ చేసుకుంటే నమ్మశక్యంగా ఉండేది.



