‘బాహుబలి 2’ ముందువరకు ప్రేక్షకులకు కనిపించిన ప్రభాస్ వేరు… ఆ తర్వాత కనిపించబోయే ప్రభాస్ వేరు..! అవును… ‘బాహుబలి 2’ ప్రభాస్ కెరీర్ ను మార్చేసింది. ఎంతలా మార్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా సాధిస్తున్న ‘మ్యాజిక్ ఫిగర్స్’కు ట్రేడ్ పండితులు సైతం నివ్వెరపోతున్నారు. కనివినీ ఎరుగని రీతిలో వస్తున్న కలెక్షన్స్ తో రాజమౌళి పేరు ఎంతలా మారుమ్రోగుతుందో, హీరోగా ప్రభాస్ పేరు కూడా అంతే స్థాయిలో ‘బ్రాండింగ్’ జరుగుతోంది.
ఒక రకంగా చెప్పాలంటే వర్మ అన్నట్లు… ప్రభాస్ స్థాయి ఇంటర్నేషనల్ కు వెళ్ళింది. అయితే ఏ హీరో అయినా అత్యున్నత స్థాయికి వెళ్ళడం గొప్ప కాదు, దానిని నిలబెట్టుకోవడం గొప్ప. మరి ‘యంగ్ రెబల్ స్టార్’ ఏం చేయబోతున్నాడు? సినిమాల పరంగా “సాహో” అంటూ మళ్ళీ మూడు భాషల్లో మరో సినిమాను సిద్ధం చేస్తున్నాడు. ‘బాహుబలి’ అంటే రాజమౌళి ‘బ్రాండింగ్’తో అత్యున్నత స్థాయికి వెళ్ళింది. మరి ‘సాహో’కు ప్రభాస్ పేరే బ్రాండింగ్. క్రేజీ దర్శకుల జాబితాలో సుజిత్ పేరు లేదు గనుక, ‘సాహో’ ఏ స్థాయి ఫలితం పొందినా, అందులో ఎక్కువ శాతం క్రెడిట్ ప్రభాస్ కే దక్కుతుంది.
‘సాహో’ పరిస్థితి ఇలా ఉంటే, ఆ తర్వాత ప్రభాస్ ను బాలీవుడ్ లో లాంచ్ చేయడానికి తెరవెనుక బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతోందని ట్రేడ్ టాక్. అవును… ‘బాహుబలి 2’ సినిమా బాలీవుడ్ లో ఘనవిజయం సాధించడానికి కారణమైన ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్, మన ‘యంగ్ రెబల్ స్టార్’ను బాలీవుడ్ లో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. బాలీవుడ్ కార్పొరేట్ సంస్కృతిని అనుసరిస్తూ ప్రభాస్ తో ఒక్కసారే ఓ రెండు, మూడు సినిమాలకు అంగీకారం తెలిపే విధంగా ఈ ఒప్పందాలు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతం విదేశాలలో విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాస్, ఇండియాకు తిరిగి రాగానే దీనికి సంబంధించిన లాంచనాలు పూర్తవనున్నాయని, బాలీవుడ్ లో ప్రభాస్ ను గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేందుకు కరణ్ జోహార్ పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్న సమాచారం ‘ఖాన్’ త్రయానికి మింగుడు పడకపోవచ్చు. ఒక దక్షిణాది హీరోకు బాలీవుడ్ లో తగిన గుర్తింపు లభించదన్న విషయం, నాడు మెగాస్టార్ గా వెలుగొందిన చిరంజీవి కాలం నుండి నిరూపణ అవుతూ వస్తోంది. అయితే ప్రభాస్ ఈ లెక్కలను మారుస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే బాలీవుడ్ పై ఫోకస్ చేస్తే… టాలీవుడ్ లో లెక్కలు మారిపోయే ప్రమాదం కూడా పొంచి ఉందన్నది అసలు విషయం..!



