పెళ్లి తరువాత సినిమాలు మానేసిన ప్రియమణి ఇప్పుడు మళ్ళీ యాక్టీవ్ అవుతుంది. అమెజాన్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ తో తిరిగొచ్చిన ఆమె ఫుల్ బిజీ అయిపోయింది. ఇప్పటికే బాలీవుడ్, కన్నడ, తెలుగులో సినిమాలు చేస్తుంది. తెలుగులో ఆమె రెండు సినిమాలు చేస్తుంది. రెండూ దగ్గుబాటి ఫ్యామిలీవే కావడం విశేషం.
రానా దగ్గుబాటి నటిస్తున్న విరాటపర్వంలో ఆమె నక్సలైట్ ‘కామ్రేడ్ భారతక్క’ గా కనిపిస్తుంది… అలాగే వెంకటేష్ నటిస్తున్న నారప్పలో ఆమె హీరో భార్య పాత్రలో కనిపిస్తుంది. ఈ రెండు సినిమాలలో ఆమె పాత్ర ఫస్ట్ లుక్ ని ఈరోజు ఆమె బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. రెండు పాత్రలకు ఆమె అతికినట్టు సరిపోయింది.
ఈ రెండు సినిమాలలోనూ మంచి పాత్రలు పడితే ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోయినట్టే. బాలీవుడ్ లో ప్రియమణి ఇటీవలే నటించిన అతీత్ అనే సినిమా ప్లాప్ గా మారింది. ఆ సినిమా జీ5 లో డైరెక్టుగా ఆన్ లైన్ రిలీజ్ అయ్యింది. అజయ్ దేవగన్ నటిస్తున్న మైదాన్ లో ఆమె కీలక పాత్రలో కనిపిస్తుంది.
అలాగే కన్నడలో ఇప్పటికే ఆమె డాక్టర్ 56 అనే సినిమా షూటింగ్ పూర్తి చేసింది. మరోవైపు ది ఫ్యామిలీ మాన్ రెండో సీజన్ ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది. లాక్ డౌన్ కు ముందే షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి కావాల్సి ఉంది.





