గత ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారంటూ హడావిడి చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత వెనకడుగు వేసింది. ఆమె సిద్దంగా ఉన్నా, కాంగ్రెస్ అదిష్టానం ఓకే చేయలేదని ఆ పార్టీ వారు కవర్ చేస్తున్నారు. రాజకీయాలలోకి వచ్చిన తొలి నాళ్లలోనే మొదటి ఎన్నికలోనే ఓడిపోతే ప్రియాంక భవిష్యత్తు రాజకీయం గందరగోళం అవుతుందని పార్టీ భావించి ఉంటుంది.
ఆమెను ఉత్తర ప్రదేశ్ వ్యవహారాలు అప్పగించి ప్రచారం చేయించినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. అయితే రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారడంతో మళ్ళీ ఆ పార్టీకి ప్రియాంకే దిక్కు అయ్యేలా ఉంది. దీనితో ఆమెను రాజ్యసభకు పంపించాలని ఆ పార్టీ ఆలోచన చేస్తుందట.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఏదో ఒక్క దానిని నుండి ఆమెను రాజ్యసభకు పంపుదామని అధిష్టానం ఆలోచన చేస్తుందట. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో అధికారంలో వుంది. మధ్యప్రదేశ్ నుంచి గానీ, రాజస్థాన్ నుంచి గానీ ప్రియాంకా గాంధీని రాజ్యసభకు నామినేట్ చేయించేందుకు సోనియాగాంధీ సిద్దమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం
అయితే.. లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ అక్కడ పార్టీ లోక్‌సభ పక్షానికి సారథ్యం వహించడం లేదు. అదే విధంగా రాజ్యసభలోకూడా ప్రస్తుతం వున్న రాజ్యసభాపక్షం నేతగా గులాం నబీ ఆజాద్‌నే కొనసాగిస్తారని చెప్పుకుంటున్నారు. ప్రియాంకను రాజ్యసభకు పంపుతుండడంతో గాంధీ కుటుంబం నుంచి తన తాత ఫిరోజ్ గాంధీ తర్వాత పెద్దలసభకు ప్రాతినిధ్యం వహించిన రెండో వ్యక్తిగా ప్రియాంక నిలవబోతున్నారు.





