టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ సైతం తీవ్రంగా ఖండించారు. కానీ తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్, రాఘవేంద్రరావు, బాలకృష్ణ తప్ప మరెవరూ స్పందించలేదు. నేడు నిర్మాత నట్టి కుమార్ స్పందించారు.
ఆయన చంద్రబాబు నాయుడు అరెస్టును గట్టిగా ఖండిస్తూనే, టాలీవుడ్‌లో పెద్దల మౌనం వహించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి, సినీ పరిశ్రమకు ఎంతో చేశారని అటువంటి వ్యక్తిని అన్యాయంగా జగన్ అరెస్ట్ చేయించి జైల్లో పెడితే టాలీవుడ్‌లో ఏ ఒక్కరూ స్పందించకపోవడం చాలా దారుణమని అన్నారు.
సినీ పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా ఆదుకొనేందుకు చంద్రబాబు నాయుడు ముందుండేవారని కానీ ఆ పెద్దాయనకి కష్టం వచ్చినప్పుడు టాలీవుడ్‌లో ఎవరికీ మాట్లాడే ధైర్యం కూడా లేదా?అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ఒక్కరే అందరి కంటే ముందుగా వెళ్ళి బేషరతుగా పెద్దాయనకి సంఘీభావం తెలిపారని, కానీ చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి వంటివారెవరూ కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరమని నట్టి కుమార్ అన్నారు. చివరికి నందమూరి కుటుంబానికి చెందిన జూ. ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదని నట్టి కుమార్ ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడుకి కష్టం వచ్చినప్పుడు రహస్యంగా ఫోన్లు చేసి సానుభూతి తెలపడం వలన ఏ ప్రయోజనమూ ఉండదని, టాలీవుడ్‌లో పెద్దలందరూ ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించి, ఆయనకు సంఘీభావం తెలిపితేనే ఏపీ ప్రభుత్వం పునరాలోచించుకొంటుందని అన్నారు.
సినీ పెద్దలు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించి, ఆయనకు సంఘీభావం తెలిపితే జగన్ అందరినీ ఉరి తీస్తారా?అని నట్టి కుమార్ ప్రశ్నించారు.
ఫిలిమ్ ఛాంబర్‌లో చంద్రబాబు నాయుడు భజనచేసేవారు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కనీసం సోషల్ మీడియాలోనైనా చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలిపేందుకు ఎవరికీ ధైర్యం చాలడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించాల్సిన బాధ్యత తెలుగు సినీ పరిశ్రమకు లేదా?ఎవరూ ఇండస్ట్రీ తరపున ఆయన అరెస్టును ఖండించలేరా?అని నట్టి కుమార్ సూటిగా ప్రశ్నించారు.
“నేను టిడిపికి దూరం కానీ చంద్రబాబు నాయుడుని చాలా గౌరవిస్తాను. ఆయన ఉండాల్సింది జైల్లో కాదు.. ప్రజల మద్య,” అని నిర్మాత నట్టి కుమార్ అన్నారు.
సినీ పరిశ్రమలో పెద్దలను జగన్ ఏవిదంగా అవమానించారో అందరికీ తెలుసు. అందుకు వారు ఆయనపై తీవ్ర ఆగ్రహంగా కూడా ఉన్నారు. కానీ ఏపీలో తమ సినిమా బిజినెస్ దెబ్బ తింటుందనే భయంతో అందరూ అవమానాలు దిగమింగుకొని మౌనం వహిస్తున్నారని అందరికీ తెలుసు.
ఆ భయంతోనే పవన్ కళ్యాణ్‌కి మద్దతు ప్రకటించడానికే భయపడుతున్నప్పుడు, ఇక చంద్రబాబు నాయుడుకి సానుభూతి, సంఘీభావం ప్రకటించేందుకు ఎలా సాహసించగలరు?అయితే ఎప్పుడూ తమ సినిమాలు, బిజినెస్ మాత్రమే చూసుకొంటారా?
సినిమాలలో హీరోయిజం ప్రదర్శించడం గొప్ప కాదు. దానిలో పదోవంతైనా నిజజీవితంలో చూపాలి. పవన్ కళ్యాణ్ ఆవిదంగా నిజజీవితంలో కూడా హీరో అనిపించుకొంటున్నారు కదా?ఆయనను వైసీపి నేతలందరూ నోటికి వచ్చిన్నట్లు దూషిస్తున్నా ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అన్నీ భరిస్తున్నప్పుడు, సినీ పరిశ్రమ తరపున అందరూ కలిసి చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించలేరా?



