వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే సహించే ప్రసక్తే లేదని తన పార్టీ నేతలకు గట్టిగా చెప్పారు. కానీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలోనే ఏకగ్రీవాలు జరిగాయి. వాటిలో కూటమి పార్టీలకు అనుకూలంగా జరిగినవే ఎక్కువ. మరీ ముఖ్యంగా జనసేన కూడా కడప జిల్లాలో, ముఖ్యంగా పులివెందులలో బోణీ కొట్టడం విశేషం.
కనుక జగన్ కంచుకోటను కూడా కూటమి పార్టీలు బద్దలు కొట్టగలిగాయి. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో చొచ్చుకుపోయి పట్టు సాధించగలిగాయి. ఇది 2029లో జరగబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో వాటికి ఉపయోగపడవచ్చు. కానీ ఆలోగా మళ్ళీ పట్టు కోల్పోకుండా ఇలాగే నిలుపుకుంటూ మరింత బలోపేతం అయ్యేందుకు గట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. అప్పుడే కూటమి వచ్చే ఎన్నికల్లో దీని పూర్తి ప్రయోజనం పొందగలుగుతుంది.
ఇక వైసీపీ విషయానికి వస్తే, శాసనసభ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఎన్నికల్లో ఓటమి సర్వసాధారణమే. కానీ వైసీపీ అనుసరించిన వ్యూహాలు, ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల దాని ఓటమి భూతద్దంలో నుంచి చూసినట్లు మరింత పెద్దదిగా కనిపిస్తోంది.
అయితే వైసీపీకి ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే, రాష్ట్రంలో కడపతో సహా అన్ని జిల్లాల్లో దాని ఓటు బ్యాంకు చెక్కుచెదిరే అవకాశం లేదు.
కనుక జగన్, వైసీపీ నేతలు, ఆయన వీరాభిమానులు ‘జగన్ 2.0’ తప్పక వస్తుందని, జగన్ పాదయాత్రతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇది వాస్తవం కూడా.
అయితే కూటమి ప్రభుత్వం ఓ పక్క రాష్ట్రాభివృద్ధి చేస్తూ, గ్రామస్థాయి నుంచి పార్టీలను బలోపేతం చేసుకుంటోంది.
మరోపక్క కూటమిలో పార్టీల మధ్య ఐక్యతను కాపాడుకుంటూనే, కేంద్ర ప్రభుత్వంతో కూడా సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది.
కానీ వైసీపీ వరుసగా తప్పటడుగులు వేస్తూనే ఉంది. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో, రాష్ట్రాభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు, డీఎస్సీ ఇలా ప్రతి అంశంలో గుడ్డిగా ప్రభుత్వ వ్యతిరేక ధోరణి కనబరుస్తోంది. ఈ ధోరణి వల్ల వైసీపీ పట్ల ప్రజల్లో దురభిప్రాయం ఏర్పడేలా చేసుకుంటోంది.
అలాగే షర్మిల కుమార్తె పెళ్ళి విషయంలో జగన్ తీరు వంటి అంశాలు కూడా వైసీపీకి నెగెటివ్ మార్కులు పడేలా చేస్తున్నాయి. దీని ప్రభావం ఎక్కువ కాలం ఉండకపోవచ్చు.
కానీ రాష్ట్రాభివృద్ధి విషయంలో కనబరుస్తున్న వ్యతిరేక ధోరణి ప్రభావం మాత్రం వైసీపీని వచ్చే ఎన్నికల వరకు వెంటాడుతూనే ఉంటుంది.
కనుక ఇప్పటికైనా ఈ వైఖరి మార్చుకుంటే దానికే మంచిది. లేకుంటే ఇదే మరోసారి వైసీపీ ఓటమికి, కూటమి గెలుపుకు కారణం కావచ్చు.




