అనుకున్నదంతా అయ్యింది… ఎలాంటి ట్విస్ట్ లకు తావు లేకుండా మరో పాన్ ఇండియా మూవీ ప్రభాస్ “రాధే శ్యామ్” కూడా వాయిదా పడింది. ఒక్కొక్క రాష్ట్రం ధియేటర్లను మూసివేస్తూ ప్రకటనలు ఇస్తుండడంతో, “రాధే శ్యామ్” యూనిట్ కు వాయిదా తప్ప మరొక ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.
దీంతో 2022 సంక్రాంతి అనేది సినీ ప్రేక్షకులకు అత్యంత నిరాశాజనకంగా ఉండబోతోంది. ప్రతి ఏడాది మూడు, నాలుగు పెద్ద సినిమాలతో సందడి చేసే తెలుగు సంక్రాంతి పర్వదినం ఈ సారి, ఒక్క పెద్ద సినిమా కూడా లేకుండా విలవిలలాడడం సినీ ప్రేక్షకులు, హీరోల అభిమానులు ముందుగా అంచనా వేసింది కాదు.
అయితే ఈ పెద్ద సినిమాల వాయిదాలు సుకుమార్ – బన్నీల “పుష్ప” సినిమాకు కలిసి వస్తుందని పేర్కొనవచ్చు. ఇప్పటికే భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న “పుష్ప”కు రాబోయే సెలవులు మరింత ఉత్సాహాన్ని ఇవ్వనున్నాయి. ప్రేక్షకులకు కూడా మరొక సినిమా లేకపోవడంతో, “పుష్ప” సినిమా ఇంకొంత ల్యాండ్ మార్క్ కలెక్షన్స్ ను అందుకోవడం ఖాయంగా కనపడుతోంది.
ఈ సినిమాను తాజాగా వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా “పుష్ప”పై ప్రశంసలు కురిపిస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సందడి చేసింది. ముందుగా ఈ కధ చేరుకున్నది మహేష్ బాబు వద్దకే కావడంతో, స్వయంగా ప్రిన్స్ నోట నుండి ప్రశంసలు లభించడం ప్రత్యేకంగా మారింది.



