పాన్ ఇండియా సినిమాగా ఈ నెల 14వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “రాధే శ్యామ్” సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఎస్.ఎస్.థమన్ అందిస్తోన్న విషయం తెలిసిందే. మూడు, నాలుగు క్రితమే ప్రకటన ఇటీవల చేసినప్పటికీ, గత రెండు నెలల నుండి “రాధే శ్యామ్” వర్క్ లో థమన్ ఉన్నారని, చిత్ర దర్శకుడు రాధాకృష్ణ తెలిపారు.
ఈ సినిమా చూసిన తర్వాత చాలా విషయాలు థమన్ చెప్పుకొస్తుంటే, ఈ సినిమాను ఎంత ప్రేమించాడు అన్న విషయం అర్థమవుతోందని, మాస్ గా చెప్పాలంటే థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో “రాధే శ్యామ్”ను లేపి అవతల పడేసాడు అంటూ రాధాకృష్ణ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. థమన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లిందని చెప్పారు.
1976లో యూరోప్ లో జరిగే ఓ ప్రేమకధా చిత్రంగా ఈ సినిమాను రూపొందించామని, ఒక ఏడాదిన్నర్ర కాలంగా యూరోప్ మొత్తం రెక్కీ చేసి ఎక్కడెక్కడ ఏం తీయాలో నిర్ణయించుకున్నామని, జాతకాలు నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళు ఇద్దరుంటారని, తాను ఏమనుకుంటున్నానో అనే విషయమే ఈ సినిమా ద్వారా చెప్పానని డైరెక్టర్ రాధాకృష్ణ విశదీకరించారు.
పూజా హెగ్డే ఈ సినిమాలో ప్రదర్శించిన అభినయం ‘స్పెల్ బౌండింగ్’గా ఉంటుందని, ఇప్పటివరకు చూసినవారంతా ఇదే చెప్పారని, సినిమా రిలీజ్ అయ్యాక బిఫోర్ ‘రాధే శ్యామ్’ ఆఫ్టర్ ‘రాధే శ్యామ్’ అని పూజకు కితాబు ఇస్తారన్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఈ సినిమాకు బడ్జెట్ ఎంత అయ్యిందో తెలియదు గానీ, విజువల్ గా, మ్యూజికల్ గా చాలా కొత్తగా ఉంటుందని చెప్పుకొచ్చారు రాధాకృష్ణ.



