రఘురామ కోసం టిడిపిలో ఎవరు త్యాగం చేయాలో?

Raghu-Rama-Krishna-Raju-Narasapuram

మాజీ వైసీపి ఎంపీ రఘురామకృష్ణరాజు టికెట్‌ వ్యవహారం టిడిపి అభ్యర్ధుల మెడకు చుట్టుకోబోతోంది. ఆయన చాలా కాలంగా టిడిపి, జనసేన, బీజేపీలతోనే అంట కాగుతున్నప్పటికీ ఇంతవరకు ఏ పార్టీలో ముందుగా చేరకపోవడంతో ఆయనకు నర్సాపురం టికెట్‌ చేజారిపోయింది.

ADVERTISEMENT

తనకు టికెట్‌ దక్కకుండా జగన్మోహన్‌ రెడ్డి బీజేపీలో మిత్రుల ద్వారా చక్రం తిప్పి అడ్డుకున్నారని రఘురామ స్వయంగా ఆరోపించారు. కానీ అది నిరూపించలేరు. రఘురామ బీజేపీలో లేరు కనుక ఆ పార్టీని నిందించలేరు కూడా.

కానీ బీజేపీ పట్టుబట్టి ఆరు ఎంపీ సీట్లు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా గెలువగల గెలుపు గుర్రాలను మాత్రమే బరిలోకి దించాలి. ఎంపీగా మంచి అనుభవం, నర్సాపురం నియోజకవర్గంపై మంచి పట్టు ఉన్న రఘురామ బీజేపీలో లేరు కనుక ఆయనను కాదనుకున్నప్పటికీ అటువంటి ధీటైన మరో వ్యక్తి గోకరాజు గంగరాజుకి ఇచ్చి ఉండాలి. కానీ కొత్త అభ్యర్ధి శ్రీనివాస వర్మకు ఇచ్చింది! తద్వారా ఎన్నికలకు ముందే ఆ సీటుని బంగారు పళ్ళెంలో పెట్టి వైసీపికి అప్పగించేసిన్నట్లయింది.

టిడిపి, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తున్నప్పుడు, గెలిచేందుకు ఎంతో శ్రమించవలసి ఉన్నప్పుడు ప్రతీ సీటు మనమే గెలుచుకోవాలి, ఆంధ్రప్రదేశ్‌లో మన కూటమి తప్పకుండా అధికారంలోకి రావాలనే తాపత్రయం బీజేపీకి ఉండాలి. కానీ టిడిపి, జనసేనలతో కలిసి పోటీ చేస్తూ, ఈవిదంగా వైసీపికి తోడ్పడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

రఘురామకు నర్సాపురం టికెట్‌ లభించకపోవడంతో ఇప్పుడు ఆయన భారం టిడిపిపైనే పడింది. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు కనుక ఆ జిల్లా నుంచే ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి శాసనసభకు పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే టిడిపి ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్ధులను ప్రకటించేసింది. కనుక ఇప్పుడు వారిలో ఒకరు రఘురామ కోసం తమ సీటుని త్యాగం చేయక తప్పదు. ఒకవేళ ఆయన చాలా కాలంగా టిడిపిలో ఉండి ఉంటే ఈ మార్పుకి పార్టీ నేతలు అంగీకరించి ఉండేవారేమో? కానీ ఆయన పార్టీలో చేరక ముందే టికెట్‌ పొందితే ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో టిడిపిలో అలజడి మొదలవుతుంది.

ఇప్పటికే జనసేన, బీజేపీల కోసం సీట్లు పోగోట్టుకొన్నవారు పార్టీపై తీవ్ర అసహనం, అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పుడు రఘురామ కోసం మరొకరు త్యాగం చేయమంటే మంటలు చెలరేగే అవకాశం ఉంది. కనుక చంద్రబాబు నాయుడు ఈ సమస్యని ఏవిదంగా పరిష్కరిస్తారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories