యూనివర్సిటీలో అర్ధరాత్రి ‘రాహుల్’ కలకలం!

Rahul gandhi hyderabad central universityరీసెర్చీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో కొన్ని రోజులుగా ఆరని కుంపటిగా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శుక్రవారం అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. రోహిత్ వేముల పుట్టినరోజును పురస్కరించుకుని విద్యార్ధులు 18 గంటల మాస్ హంగర్ స్ట్రయిక్ ను ప్రారంభించారు. అర్ధరాత్రి మొదలైన ఈ దీక్షలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు.

అయితే రాహుల్ గాంధీకి వర్సిటీ గేటు వద్దే నిరసనలు స్వాగతం పలికాయి. రాహుల్ ఎంట్రీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేసారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీలు ఝుళిపించారు. అలాగే పెద్ద సంఖ్యలో ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అర్ధరాత్రి వేళ జరిగిన ఈ ఉదంతం వర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.

ADVERTISEMENT

అనంతరం రోహిత్‌ స్మారక స్థూపం వద్ద నివాళులర్పించిన రాహుల్, విద్యార్ధులు ప్రారంభించిన 18 గంటల దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షలో రోహిత్‌ తల్లి రాధిక, సోదరుడు రాజా, పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా వున్నారు. శనివారం మధ్యాహ్నం వరకు జరిగే నిరసన దీక్షలో రాహుల్ భాగస్వామి కానున్నారు. ఏబీవీపీ కార్యక్రమాల రీత్యా రాహుల్‌ పర్యటనను పురస్కరించుకొని పోలీసులు విశ్వవిద్యాలయంలో భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు.

ADVERTISEMENT
Latest Stories