“బాహుబలి” సినిమా షూటింగ్ ను ‘జక్కన్న’ ఏ విధంగా పూర్తి చేసారో అందరికీ తెలిసిందే. యూనిట్ సభ్యులు మొబైల్ ఫోన్లతో షూటింగ్ కు రాకుండా, అలాగే బయట వ్యక్తులు స్పాట్ లోకి ప్రవేశించకుండా కొన్ని నియమ నిబంధనలను పెట్టారు. దీంతో షూటింగ్ విజువల్స్ గానీ, ఆన్ సెట్స్ ఫోటోలు గానీ బయటకు రాలేదు. ఏదైనా చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసినవే గానీ, షూటింగ్ సందర్భంలో ఎటువంటి లీక్ లు జరగలేదు. అయితే షూటింగ్ తర్వాత ప్రక్రియలో లీక్ ల గురించి అందరికీ తెలిసిందే.
ఇక, ‘బాహుబలి’ కధకు కొనసాగింపుగా జరుగుతున్న ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ షూటింగ్ కు ఇలాంటి నియమాలనే వర్తింప చేస్తున్నారని సమాచారం. తొలుత మొబైల్ ఫోన్లను అనుమతివ్వగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో సందడి చేయడంతో, సెల్ ఫోన్స్ ను అనుమతించడం లేదట. అలాగే యూనిట్ సభ్యులందరికీ కూడా ‘బాహుబలి’ ఐడీ కార్డ్స్ జారీ చేసారు. ఈ కార్డ్స్ ఉన్న వ్యక్తులనే లోపలికి అనుమతిస్తున్నారు. కెమెరామెన్ షెంతిల్ కుమార్ దీనికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.
సాధారణంగా హాలీవుడ్ సినిమాలకు ఇలాంటి ప్రక్రియ ఉంటుంది. మన దక్షిణాదిలో శంకర్ మాత్రమే ఇలాంటి నియమాలను యూనిట్ సభ్యులకు విధించేవారు. ‘బాహుబలి’ సినిమాతో రాజమౌళి కూడా దీనిని అలవర్చుకున్నారు. అయితే ఇది ‘బాహుబలి’ వరకే పరిమితమవుతుందా లేక జక్కన్న మున్ముందు సినిమాలకు కూడా కొనసాగుతుందో చూడాలి.





