ఇప్పటికే ‘గన్స్ అండ్ థైస్’తో ఒక్కసారి ఇండియన్ మూవీ లవర్స్ ను తన వైపుకు తిప్పుకున్న రాంగోపాల్ వర్మ భవిష్యత్తు ప్రాజెక్ట్స్ ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే… ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడడం ఖాయం. ఇంతకీ ఆ సంచలన వార్త ఏమిటి? అంటే… ‘రామాయణం’ సబ్జెక్ట్ లో ఒక చిన్న పార్ట్ ను షార్ట్ ఫిల్మ్ గా తీయబోతున్నానని తెలిపారు. అయితే ఇందులో రాముడు మాత్రం ఉండరని మరో ట్విస్ట్ ఇచ్చారు.
రాముడు అడవులకు వెళ్ళే ముందు దశరధుడు – కైకేయి మధ్య ముందు రోజు రాత్రి, వాళ్ళ బెడ్ రూమ్ లో ఏం జరిగింది? వారిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుంది? అన్నదే తన షార్ట్ ఫిల్మ్ కధగా చెప్పుకొచ్చారు వర్మ. తన పాయింట్ లోనే ఈ సినిమా ఉంటుంది తప్ప, ఎవరో ఏదో చెప్పింది తాను తీయబోనని, తాను ఏదైతే తీయాలనుకున్నానో అదే తీస్తానని… భవిష్యత్తు ప్రాజెక్ట్ గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు.
అంటే మీ తరహా పైత్యం ఉండబోతుందా? అంటూ యాంకర్ ప్రశ్నించగా, దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి అంటూ వర్మ బదులిచ్చారు. దేవుడ్ని నమ్మని వర్మ, అనేక సందర్భాలలో వినాయకచవితి, శ్రీరామనవమి వంటి పండగలపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. మరి అలాంటి వర్మ ‘రామాయణం’లోని ఈ చిన్న పార్ట్ ను వ్యంగ్యంగా తీస్తారా? లేక సదరు యాంకర్ అన్నట్లు… తన పైత్యాన్ని ప్రదర్శిస్తారా? అనేది వేచిచూడాలి.



