“బాహుబలి 2” సినిమా గురించి చిత్ర దర్శకుడు రాజమౌళి కూడా అన్ని సార్లు ట్వీట్ చేసారో లేదో గానీ… ఈ సినిమాకు సంబంధించి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎన్ని ట్వీట్లు చేసారో లెక్కే లేదు. ఈ సినిమాను చిరంజీవి 150వ సినిమాతో పోలుస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’తో పోలుస్తూ చేసిన ట్వీట్స్ అయితే మెగా ఫ్యాన్స్ కు ఆగ్రహాన్ని తెప్పించాయి. అలా ‘బాహుబలి 2’ను ట్వీట్ల వానలో తడిపేసిన ఘనతను రాంగోపాల్ వర్మ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
మరి ఇంతకీ ఈ సినిమాను వర్మ ఎన్ని సార్లు చూసారు… అంటే, ఒక్కసారి కూడా చూడలేదు అన్న సమాధానమే వెలువడింది. కానీ తన మొబైల్ లో పైరసీ ప్రింట్ చూసానని, అది కూడా మొత్తం కాదని, అక్కడక్కడ చూసానని తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేసారు. ‘బాహుబలి 2’ సినిమా నాకు నచ్చిందా లేదా అన్నది అసలు విషయమే కాదు గానీ, ఈ సినిమా సృష్టించిన సంస్కృతి, హంగామా తనకు బాగా నచ్చాయని, అందుకే ఈ సినిమాపై తన భావాలను వ్యక్తపరుస్తూ వరుస ట్వీట్లు చేసానని తెలిపారు.
‘బాహుబలి 2’ సినిమా రియల్ హీరో రాజమౌళియేనని కుండబద్దలు కొట్టిన వర్మ, ప్రస్తుతం ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ స్టార్ హీరోలలో ‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్ అని, మీడియాలో ఇది ప్రముఖంగా రాకపోవచ్చు గానీ, ఇందులో ఏ మాత్రం డౌట్ లేదని చెప్పారు. గ్రౌండ్ లెవల్లో ఏ చిన్న కుర్రోడిని కదిలించినా ప్రభాస్ తెలుసని, ఆ స్థాయికి ప్రభాస్ వెళ్లిపోయాడని, దీని పట్ల తెలుగు స్టార్ హీరోలలో కొంత జలస్ ఉండొచ్చని, అలా లేకపోతే వారు స్టార్ హీరోలే కాదని, తనదైన సిద్ధాంతంలో వర్మ చెప్పుకొచ్చారు.



