విషయం ఏదైనా గానీ సీన్ లోకి పవన్ కళ్యాణ్ ను తీసుకువచ్చి, పవర్ స్టార్ అభిమానులకు నిద్రలేని రాత్రులను కానుకగా ఇచ్చే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నుండి ‘క్షమాపణలు’ వచ్చాయి. ఊహించడానికి కష్టసాధ్యంగానే ఉన్న విషయం నిజంగా నిజం. ఎంత నిజం అంటే వర్మ వోడ్కాను కూడా వదిలేసినంత వాస్తవం. మరో విశేషమేమిటంటే… దేవుడి పైన కూడా ఎటకారపు ట్వీట్లు చేసిన వర్మ అందుకు కూడా క్షమాపణలు చెప్పారు.
“తన వ్యాఖ్యలతో కలత చెందిన వినాయకస్వామి భక్తులకు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులకు క్షమాపణలు చెప్తున్నానని” వర్మ తాజాగా ట్వీట్ చేసారు. అయితే ఇప్పటికైనా చేసిన ట్వీట్ పై నిలబడతారా? లేక మరో పెద్ద సినిమా విడుదలైనపుడు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తారా? అన్నది వేచిచూడాలి. ఎందుకంటే… గతంలో ఓ సారి.. ఇక పవన్ పై ట్వీట్లు చేయనని చెప్పి, తర్వాత మాట తప్పారు. వర్మ నుండి ఊహించని విధంగా వచ్చిన ‘సారీ’తో పవన్ ఫ్యాన్స్ కాస్త శాంతించినా నమ్మడానికి సిద్ధం గా లేరు మరి, పాత గాయాలు అలాంటివి మరి !



