“కామం కళ్ళు మూసుకుపోయేలా చేస్తుందంటారు…” ఈ వ్యాఖ్యలను నిజం చేయడానికే ఇలాంటి వాళ్ళు పుట్టారని అనిపించక మానదు. ప్రతిరోజూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను పేపర్లు, టీవీలలో చూసి… ‘అయ్యో పాపం’ అనుకోవడం సాధారణమైపోయింది. ఓ విధంగా ఇలాంటి ఘటనల పట్ల ప్రజల రియాక్షన్ తగ్గిపోయింది. రోజూ పదుల సంఖ్యలో నమోదవుతున్న మహిళలపై అకృత్యాలను మీడియా వర్గాలు కూడా ‘లైట్’గా తీసుకుంటున్నాయి.
అయితే ఉత్తరప్రదేశ్ లోని అసిఫ్ నాగ్లా విలేజ్‌లో 28 రోజుల పసికందుపై 25 ఏళ్ల నామినో అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటనను సగటు మనిషి జీర్ణించుకోలేకపోతున్నాడు. చిన్నారి పేరెంట్స్ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్ళగా.., తిరిగి ఇంటికి వచ్చేసరికి పాప తీవ్ర రక్తస్రావంతో బాధపడడం గమనించి, చిన్నారిని ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యధావిధిగా… తమ విధి నిర్వహణలో భాగంగా నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
నిజంగా సభ్య సమాజం సిగ్గుపడాల్సిన సంఘటన… మన దేశ ప్రజలకు ‘మానవత్వం’ బహు దూరాన ఉందన్న సంకేతాలను పంపే దుశ్చర్య… అభివృద్ధి పేరుతో నేటి ప్రజలు ఎటు పోతున్నారు? కురచ దుస్తులు వేసుకోవడం వల్లే మహిళల పై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తపరిచిన ‘మహామహులు’ ఇప్పుడు ఏమంటారు..? బహుశా ఆ చిన్నారి దుస్తులు సరిగా వేసుకుని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని చెప్తారా..? ‘కుయ్…’ అన్న ఏడుపు ధ్వని తప్ప ఇంకేం తెలియని చిన్నారి పై జరిగిన అకృత్యానికి నేటి నేతలు ఏం సమాధానం చెప్తారు..? నిజంగా వీరు మనుషులేనా? లేక మానవ రూపంలో ఉన్న మృగాలా? నిజంగా మృగాలకు ఇంత హృదయం ఉంటే… అవి కూడా ఇంత ఘోరంగా ప్రవర్తించవేమో..!
ఛీ… ఛీ… విచక్షణ లేని ఈ “విజ్ఞానవంతులందరికీ” శతకోటి వందనాలు..!
ఏం చేసినా చూస్తూ ఉండే భారతీయ న్యాయవ్యవస్థకు కోటి కోటి దండాలు..!





