శాస్త్రి గారు… ఎవరి కోసం ఈ కుళ్ళు రాజకీయాలు..!

Ravi Shastriఅలా టీమిండియా కోచ్ గా ఎంపిక అయ్యారో లేదో అప్పుడే మళ్ళీ లుకలుకలు మొదలెట్టారు రవిశాస్త్రి. నిజానికి అసలు ఈ పదవి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను వరిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే చివరి నిముషంలో సచిన్ జోక్యంతో మరియు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సూచనలతో రవిశాస్త్రి పేరు ఫైనల్ అయ్యింది. అయితే రవిశాస్త్రి నియామకాన్ని సౌరవ్ గంగూలీ పూర్తిగా విభేదించినట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT

అన్నింటిని దాటుకుని కోచ్ గా బాధ్యతలు చేపట్టాల్సిన తరుణంలో… తనతో పాటు బౌలింగ్ కోచ్ గా ఎంపికైన జహీర్ ఖాన్ ను తక్కువ చేస్తూ… అతను బౌలింగ్ కోచ్ గా సరిపోడని, అతని స్థానంలో భరత్ అరుణ్ ను ఎంపిక చేయాలని రవిశాస్త్రి చేసిన కామెంట్స్ బీసీసీఐ వర్గాలకు తలనొప్పులుగా మారాయి. ముఖ్యంగా టీమిండియాలో జరుగుతున్న ఈ వివాదాస్పద పరిణామాలు అభిమానులకు ఒకింత చిరాకు తెప్పిస్తున్నాయి.

కుంబ్లే అకస్మాత్తుగా వెళ్ళిపోవడంతో ప్రారంభమైన ‘సెగ’ అలాగే కొనసాగుతుండడం విశేషం. జహీర్ ఖాన్ మంచి బౌలర్, కానీ కోచ్ గా తగినంత అనుభవం లేదని ప్రశ్నిస్తున్న రవిశాస్త్రి, అంతకుముందు తాను ఏ ఏ జట్లకు కోచ్ గా వ్యవహరించి, టీమిండియాకు ఆ స్థానంలో ఎంపికయ్యారో చెప్తే సరిపోయేది. బహుశా జహీర్ తో పాటు కొన్నాళ్ళు ట్రావెల్ అయిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేస్తే అందులో అర్ధముంటుంది గానీ, ఇప్పుడే చేయడం అనేది తొందరపాటు చర్య అవుతుందని శాస్త్రి గారు తెలుసుకోలేకపోయారా!

ఈ తాజా వ్యాఖ్యలతో మరోసారి గంగూలీ పేరు తెరపైకి వచ్చింది. రవిశాస్త్రి ఇలాంటి వ్యక్తి కావడంతోనే నాడు గంగూలీ తీవ్రంగా వ్యతిరేకించి ఉంటారన్న టాక్ సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ చేస్తోంది. తాను కెప్టెన్సీలో ఉన్నపుడు జట్టు కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్న గంగూలీ, సీఏసీలో కూడా రవి వద్దంటూ అలాంటి అభిప్రాయాన్నే వెల్లడించారని, అయితే జట్టు సభ్యులు, కెప్టెన్ కోరుకున్న వారిని ఇవ్వడమే సముచితం అన్న నిర్ణయంతో శాస్త్రిని ఈ రోజు ఇలా నిలబెట్టింది.

లేటెస్ట్ అందిన ట్విస్ట్ ఏమిటంటే… అసలు జహీర్ ఖాన్ ను ఎంపిక చేసే సమయంలో కూడా రవిశాస్త్రిని సంప్రదించే నిర్ణయం తీసుకున్నామని సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లు తాజాగా ఓ లేఖ విడుదల చేసారు. తాము పరిధి దాటి ప్రవర్తించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, జరిగిన ప్రక్రియకు సంబంధించిన వీడియో ఫుటేజ్ లు బయటపెట్టాలని కోరుతూ సీఓఏకు లేఖ రాసారు. మరి తమను సంప్రదించి తీసుకున్న నిర్ణయం తర్వాత కూడా ఈ కుళ్ళు రాజకీయాలు ఎవరి కోసం శాస్త్రి గారు..?!

ADVERTISEMENT
Latest Stories