మాస్ మహారాజా రవితేజ – నందమూరి నటసింహం బాలకృష్ణల నడుమ భారీ తగువు అయ్యిందని, దీనిని సెటిల్ చేయడానికి ఇండస్ట్రీ పెద్దలు కూడా రంగంలోకి దిగారంటూ ఒకానొకప్పుడు హల్చల్ చేసిన పుకార్ల సంగతి ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. ఇదే విషయాన్ని స్వయంగా రవితేజనే అడిగేసారు బాలయ్య.
‘మొదలుపెట్టే ముందు బాసు ఒక క్లారిటీ తీసుకోవాలి… నీకు నాకు పెద్ద గొడవ అయ్యిందంట కదా..’ అని బాలయ్య అడగగా, ‘పనిపాట లేని డాష్ నా డాష్ గాళ్ళకు ఇదే పని’ అంటూ రవితేజ స్పందించారు. ఇదంతా ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ లేటెస్ట్ ఎపిసోడ్ లో భాగంగా కట్ చేసిన ప్రోమోలో రిలీజ్ చేసారు.
నిజానికి బాలకృష్ణ షోలో రవితేజ పాల్గొంటున్నారని వార్తలు వచ్చిన వెంటనే ప్రేక్షకుల మదిలో మెదిలిన మొదటి ప్రశ్ననే బాలకృష్ణ షో మొదలుపెట్టక ముందే అడిగేసారు. దానికి రవితేజ చెప్పిన జవాబుతో ఓ స్పష్టత ఇచ్చినట్లయింది. రవితేజ వ్యక్తిగత విషయాలను, ఇప్పటివరకు తెలియని అంశాలను ప్రస్తావిస్తూ ఈ ఎపిసోడ్ ను ఆసక్తికరంగా మార్చారు.
విజయవాడ, మొగల్రాజపురంలో అమ్మాయిలకు సైట్ కొట్టేవాడివంట కదా… మేము చిన్నపుడు ఇలాగే చేసేవాళ్ళములే అన్న ప్రశ్నకు ‘ఇదంతా మీకెలా తెలుసండి’ అంటూ రవితేజ తన ఆశ్చర్యాన్ని ప్రకటించగా, మాది కృష్ణాజిల్లానే బాసు అంటూ బాలయ్య పలికిన వైనం ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది.
నీ కొడుకు నీ కంటే టాలెంట్ అంట కదా అని మాస్ మహారాజాని అడగగా, వాడు ‘డీ.ఎన్.కే’ అని అంటే ‘దొంగ నా డాష్’ అంటూ రవితేజ సంబరపడిపోయారు. ఈ సందర్భంగా వచ్చిన దర్శకుడు మలినేని గోపీచంద్ తనకు బ్లాక్ బస్టర్ ఇవ్వకపోతే గన్ పెట్టి కాల్చేస్తానని చిన్న పిల్లల మాదిరి గోపిచంద్ పొట్టలో వేలు పెట్టి పేల్చేశారు బాలయ్య.



