“బంధించడానికి మేము రెడీ…ప్రశ్నించడానికి మేమూ రెడీ”..!

Revanth Reddy Comments On KCR

తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన రేవంత్ ఇంతవరకు కేసీఆర్ పై నేరుగా విమర్శలకు దిగలేదు. కానీ లండన్ పర్యటనలో ఉన్న రేవంత్ తాజాగా కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బిఆర్ఎస్ నేతలలో ముఖ్యంగా కేటీఆర్ కు కోపాన్ని, ఆవేశాన్ని తీసుకువచ్చాయి. తన తండ్రి కేసీఆర్ ను ఎప్పుడు పులితో పోల్చే కేటీఆర్ కు ఆ పులి కథ తోనే కౌంటర్ వేశారు ముఖ్యమంత్రి రేవంత్.

ADVERTISEMENT

పులి ఇంట్లో పడుకుని ఉందంటా., త్వరలో బయటకు వస్తుందంటా..! అంటూ మొదలుపెట్టిన రేవంత్ ఆ పులిని పట్టుకోపెట్టడానికి మాకాడ బోనులు ఉన్నాయి, నేను కూడా దాని కోసమే ఎదురుచూస్తున్నా బిడ్డా, బయటకొస్తే మా కార్యకర్తలు పట్టుకుని చెట్టుకుకట్టేస్తారు అంటూ కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలే చేసారు ముఖ్యమంత్రి రేవంత్. అలాగే బిఆర్ఎస్ పార్టీని కూడా 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెడతా, అధికారం పోయినా ఇంకా బిఆర్ఎస్ నేతలకి బలుపు, అహంకారం తగ్గలేదు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ నేతలకు వాటిని తగ్గించే బాధ్యత నాది అంటూ అటు బిఆర్ఎస్ పార్టీ పైన ఆ ఆపార్టీ అధినేత పైన రెచ్చిపోయారు రేవంత్. రాజకీయాలలో విమర్శకు ప్రతి విమర్శ సహజమే అయినప్పటికీ ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి పై ఎంత ఘాటుగా విమర్శలు గుప్పించారో కేటీఆర్ కూడా అంతే బలంగా బదులిచ్చారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వంద రోజులలో అమలు చేయండి తరువాత మా పార్టీ గురించి ఆలోచిద్దురుగాని అంటూ కేటీఆర్ రేవంత్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. ఈ నెల 200 యూనిట్లకు తక్కువ వచ్చిన కరెంట్ బిల్లులను ఎవరు చెల్లించవద్దని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల హామీలలో ఒకటైన 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ హామీని కాంగ్రెస్ పార్టీ సత్వరమే అమలు చేయాలనీ, ఈ బిల్లులన్నీ ఢిల్లీ సోనియా గాంధీ నివాసానికి పంపాలని, ఆమె మీ బిల్లులు చెల్లిస్తారంటూ ఎన్నికల ప్రచారంలోరేవంత్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసారు.

అలాగే బిల్లులు చెల్లించమని అధికారులు అడిగితే ఎన్నికల ప్రచారంలో రేవంత్ మాట్లాడిన వీడియో చూపించాలంటూ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు కేటీఆర్. ఇలా రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు అధికార విపక్షాల మధ్య ఎన్నికల పోరు ఎలా ఉండబోతుంది అనేది
జస్ట్ శాంపిల్ చూపించనిట్టుగా రేవంత్ – కేటీఆర్ వ్యాఖ్యలు ఒక్కసారిగా తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. దీనితో “బంధించడానికి అధికార పార్టీ రెడీ…ప్రశ్నించడానికి ప్రతిపక్ష పార్టీ” సిద్ధంగా ఉందనేది స్పష్టమయ్యింది.

ADVERTISEMENT
Latest Stories